‘సర్‌’పై అప్రమత్తంగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై అప్రమత్తంగా ఉంటాం

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

నల్లగొండ : అర్హుల ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, సర్‌ విషయంలో అప్రమత్తతతో వ్యవహరిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) సర్‌ బూత్‌ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం అంశాలపై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ సెక్రటరీ సచిన్‌ సావంత్‌ ఆధ్వర్యంలో జరిగిన జూమ్‌ మీటింగ్‌లో మంత్రి కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. నల్లగొండ, భువనగిరి లోక్‌సభల్లో చేపట్టే ఓటర్ల జాబితా సవరణకు పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని అందుకు బూత్‌ లెవల్‌ కమిటీ బాధ్యతలు తీసుకోవాలన్నారు. అకారణంగా తొలగింపునకు గురైన ఓటర్లకు తిరిగి అప్పీల్‌ చేసుకోవడం, దరఖాస్తు చేసుకునేందుకు మూడు నెలల సమయం ఇచ్చేలా ఎన్నికల కమిషన్‌ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేలా కాంగ్రెస్‌ తరఫున తెలియజేయాలన్నారు. నామినేటెడ్‌, కార్పొరేషన్‌ పదవుల్లో 20, 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న వారికి ఇవ్వాలని కోరారు. మంత్రి కోమటిరెడ్డి ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తం చేసిన ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పార్టీ కోసం కష్టపడే వాళ్లకే పదవులు ఇస్తామని, అర్హులైన వారి పేర్లు మీరే ఇవ్వండి అని సూచించారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్‌ నాయకులు చాలా మంది ఉన్నారని, మంత్రి ఉత్తమ్‌, సీనియర్‌ నేత జానారెడ్డితో కలిసి సమాలోచనలు చేసి జాబితా ఇస్తామని తెలిపారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement