కోదాడ : కోదాడలో పోస్టాఫీస్‌కు సొంత భవనం నిర్మించాలని కోరుతూ పోస్టాఫీస్ భవన సాధన కమిటీ సభ్యులు శుక్రవారం గుంటూరులో కేంద్ర కమ్యూనికేషన్ల సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. 80 వేల జనాభా ఉన్న కోదాడలో పోస్టాఫీస్‌కు సొంత భవనం లేక తీవ్ర ఇబ్బందిగా ఉందన్నారు. పట్టణ కేంద్రంలో పోస్టాఫీస్‌కు కోసం కేటాయించిన స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కమిటీ కన్వీనర్ గంధం బంగారు, డాక్టర్ సుబ్బారావు, రావెళ్ల సీతారామయ్య, ముత్తవరపు పాండురంగారావు, వేమూరి సురేష్ ఉన్నారు.
ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేస్తే ఉద్యమం
మునగాల : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీరాంజీ పథకాన్ని తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు హెచ్చరించారు. ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నిర్వహించిన ‘గ్రామీణ బంద్’ నిర్వహించారు. మండలంలోని గణపవరం పరిఽధిలో చేపట్టిన బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి చందా చంద్రయ్య, మాజీ సర్పంచ్ నాగేశ్వరమ్మ, నాయకులు అంజయ్య, వెంకన్న, ఉపాఽధికూలీలు, మేట్లు పాల్గొన్నారు.
పుస్తక పఠనంతో
విజ్ఞానం పెంపు
సూర్యాపేట : విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థులకు గ్రంథాలయ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ గ్రంథాలయ వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సహాయ గ్రంథ పాలకుడు వి.శ్యాంసుందర్‌రెడ్డి, నిర్మల, సృజన, భవాని, సిబ్బంది పాల్గొన్నారు.
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. మహిళా భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులను నివేదించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని మంగళ వాయిద్యాల నడుమ, పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


