ఫ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శ
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెల గారడీ చేశారు తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. శనివారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ నమాట్లాడారు. రియల్ ఎస్టేట్, ఫ్యూచర్ సిటీ పేరుతో కమీషన్లు తీసుకునేందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. వ్యవసాయానికి, పేద బడుగు బలహీన వర్గాలతో పాటు యువత ఉపాధి కల్పనకు నిధులు కేటాయించలేదని, ఏ వర్గానికి కూడా ఈ బడ్జెట్ న్యాయం చేయలేదన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలకు కూడా నిధులు లేవన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని, బడ్జెట్లో బీసీలకు ఏటా 20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మూడు బడ్జెట్లకు రూ.12వేల కోట్లు పెట్టి చేతులు దులుపుకుందన్నారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్ళు అయిందని, ఇక ఉన్నది రెండు బడ్జెట్లు కాబట్టి వచ్చినవన్నీ దోచుకుందాం పంచుకుందాం అన్న రీతిలో ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, తూడి నర్సింహారావు, ఆకుల లవకుశ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


