మేళ్లచెరువు : ఖరీప్‌లో సాగుచేసిన పత్తి, కంది, పెసర వంటి పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఈ యాసంగి సీజన్‌లో మొక్కజొన్న పంటపై దృష్టి సారించారు. తక్కువ నీరు అవసరమయ్యే మొక్కజొన్నను ఎంచుకున్నారు. ప్రస్తుతం మేళ్లచెరువు మండల వ్యాప్తంగా సుమారు 1020 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. తక్కువ రోజుల్లోనే దిగుబడి వచ్చే విత్తనాలను ఎంచుకున్నారు. కేవలం మూడు నెలల్లోనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. మొక్కజొన్నకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరగడానికి ప్రధాన కారణమైంది.
ధర ఆశాజనకం..
బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటాకు 2,100 రూపాయల నుంచి 2,400 రూపాయల వరకు ధర లభిస్తుంది. పెట్టుబడి తక్కువగా ఉండి, గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు మొక్కజొన్నసాగు ద్వారా ఆర్థిక కష్టాల నుంచి బయటపడతామని ఆశిస్తున్నారు. మొక్కజొన్న సాగుకు వ్యయం ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కవ. ఎకరాకు కేవలం రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. తెగుళ్ల బెడద మొక్కజొన్నకు నామమాత్రంగానే ఉండడంతో పురుగుమందుల ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా పంట దిగుబడి కూడా ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల వరకు వస్తుండడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ఫ తక్కువ పెట్టుబడి.. మెరుగైన దిగుబడి
ఫ గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతుల ఆసక్తి


