రైతు భరోసా ఏమాయే!
భానుపురి (సూర్యాపేట) : రైతుభరోసా నిధుల కోసం జిల్లా రైతాంగం ఎదురు చూస్తోంది. ఏటా వానాకాలం, యాసంగి పంట పెట్టుబడికి అందించే నిధులు ప్రతి సీజన్‌లోనూ ఆలస్యమవుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికలు ముగియగానే రైతుభరోసా నిధులు ఇస్తామని ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యాయి. పాలకవర్గాలు సైతం కొలువుదీరాయి. అయినా ముఖ్యమంత్రి ప్రకటన మేరకు ఇంతవరకూ నిధులు జమకాలేదు. ఈనెల 17న నిధులు రైతుల అకౌంట్లలో జమ చేయనుందని ప్రచారం జరిగినా.. దీనిపై స్పష్టమైన ప్రకటన రాలేదు. దీంతో రైతు భరోసా నిధుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు.
జిల్లాలో 2,79,853 మంది రైతులు..
జిల్లావ్యాప్తంగా 8,95,680 ఎకరాలు సాగవుతోంది. ఈ భూమిని 2,79,853 మంది రైతులు సాగు చేస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు విడతల్లో అందించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎకరానికి రూ.15వేలను రెండుసార్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఈ నిధులను ప్రతిఏటా పెంచుతామని మొదటగా ఎకరానికి రూ.6వేలుగా రెండు విడతల్లో రూ.12 వేలను రైతుల ఖాతాల్లో జమచేస్తామని చెప్పి గత యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,44,423 మంది రైతుల అకౌంట్లలో రూ.232.92 కోట్లను జమ చేసింది. ఈ సమయంలో పది ఎకరాల పైబడి ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులను ప్రభుత్వం జమచేయలేదు. వివిధ కారణాలతో పది ఎకరాల లోపు ఉన్న రైతులకు కొందరికి ఈ పథకం కింద నిధులు జమ కాలేదు. ఈ వానాకాలం సీజన్‌లో పంటలను సాగు చేసిన ప్రతి రైతును ఈ పథకాన్ని వర్తింప జేయగా.. 2,87,234 మంది రైతులకు రూ.366.50 కోట్లను అందించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో..
రాష్ట్రంలో వరసగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరగగా.. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు గాను ఈ యాసంగి సీజన్‌లో ఇవ్వాల్సిన రైతుభరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా నిధుల విడుదలలో ఆలస్యమైంది. అయితే గతంలో మాదిరిగానే డిజిటల్ సర్వే చేసి పంటలు సాగు చేసిన రైతులకే కాకుండా జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఫ ప్రతి సీజన్‌లో ఆలస్యమవుతున్న
పంట పెట్టుబడి సాయం
ఫ మున్సిపల్ ఎన్నికలు ముగిశాక
ఇస్తామని ప్రకటించినా
ఇప్పటివరకు జమ కాని నిధులు
ఫ పెట్టుబడి సాయానికి
రైతుల ఎదురుచూపు


