రాజేష్ మృతిపై మంత్రి మౌనం వీడాలి : మందకృష్ణ
సూర్యాపేట : కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మౌనం వీడాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.రాజేష్ మృతిపై 58 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి స్పందించడం లేదన్నారు. పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం వల్లే రాజేష్ మృతి చెందాడని ఆరోపించారు. ఈ కేసులో చిలుకూరు ఎస్‌ఐ సురేష్‌రెడ్డి ఏ1గా, కోదాడ రూరల్ సీఐ ప్రతాప్‌లింగం ఏ2గా ఉన్నారని.. కానీ, సీఐని సస్పెండ్ చేసిన అధికారులు.. ఎస్‌ఐపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎస్‌ఐ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే చర్యలు తీసుకువడంలో ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు రాజేష్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఫిబ్రవరి 5న నిర్వహించే చలో సూర్యాపేట కలెక్టరేట్ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజాసంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. యాతాకుల రాజన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు డేవిడ్‌కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు వైవితో పాటు జీడి భిక్షం, వెంకటేశ్వర్లు, ఆవుల నాగరాజు, నెమ్మది వెంకటేశ్వర్లు, కోటా గోపి, కుంట్ల ధర్మార్జున్, రామశంకర్, నల్లేడ మాధవరెడ్డి, కుంబం నాగరాజు, మున్నంగి నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.


