ప్రయోగాలకు నిధులొచ్చాయ్..
ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలోని ఎనిమిది కళాశాలలకు గాను ఒక్కో కళాశాలకు రూ.50వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి. వీటిని ఖర్చు చేయడానికి అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. టెండర్లు పిలిచి అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేస్తాం.
– భానునాయక్, డీఐఈఓ
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఇబ్బందులు తొలిగా యి. ప్రాక్టికల్ పరీక్షలు సమీపిస్తుండటం.. నిధులు మంజూరు కాకపోవడంతో అధ్యాపకుల్లో ఆందోళన నెలకొంది. ఇంటర్‌బోర్డు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసింది.ఒక్కో కళాశాలకు రూ.50 వేల చొప్పున విడుదల చేసింది. ఈ నిధులతో ప్రాక్టికల్స్‌కు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేయనున్నారు.
జిల్లాలో కళాశాలలు ఇలా..
జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు ప్రైవేట్ కళాశాలలు 30 ఉన్నాయి. ఇక మోడల్ స్కూల్స్ 9, సోషల్ వెల్ఫేర్ 8, బీసీ వెల్ఫేర్ 8, కేజీబీవీలు 15, మైనార్టీ వెల్ఫేర్ 4, ట్రైబల్ వెల్ఫేర్ 3, రెసిడెన్షియల్ ఒకటి చొప్పున ఉన్నాయి. వీటిలో మొదటి సంవత్సరం 8,500, ద్వితీయ సంవత్సరంలో 7,900 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి.
సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్స్
ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈసారి సొంత కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలు రాసే అవకాశం లేదు. నిర్దేశిత సెంటర్లలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కళాశాలలు సెల్ఫ్ సెంటర్లలోనే పరీక్షలు నిర్వహించుకోవచ్చు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 41కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రతి ల్యాబ్‌లో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి వాయిస్, వీడియో రికార్డింగ్ సౌకర్యం ఉంటుంది. కెమెరాలు నేరుగా ఇంటర్‌బోర్డు కార్యాలయానికి అనుసంధానమై ఉంటాయి.
ఒక్కో కళాశాలకు
రూ.50 వేలు విడుదల
పరికరాలు, రసాయనాల
కొనుగోలుకు ఖర్చు
ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు


