కాంగ్రెస్ పార్టీకి పోటీనే లేదు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇతర ఏ పార్టీలతో పోటీనే లేదని, ఐక్యమత్యంగా ఉండి సూర్యాపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులను కై వసం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలను కై వసం చేసుకుంటుందని, ప్రజల్లో ఇదే విశ్వాసం ఉందని, అంతే నమ్మకంతో రాష్ట్రంలో పాలన సాగిస్తుందని చెప్పారు. పదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభంలో పెట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా ప్రకటించొద్దని, పార్టీ వేదికపై చర్చించుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, తండు శ్రీనివాస్, పెద్దిరెడ్డి రాజా, చకిలం రాజేశ్వర్ రావు, వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇంచార్జి మంత్రి లక్ష్మణ్‌కుమార్


