బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలి

Oct 18 2025 7:37 AM | Updated on Oct 18 2025 7:37 AM

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలి

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలి

భానుపురి (సూర్యాపేట) : దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా టెలికాం ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ పి.వెంకటేశం శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ ఆఫర్లలో భాగంగా ఈనెల 15 నుంచి నవంబర్‌ 15వ తేదీ వరకు కేవలం రూపాయికే ప్రీపెయిడ్‌ మొబైల్‌ కనెక్షన్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పోర్టబిలిటీ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌కు మారే కొత్త వినియోగదారులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. దీంతో నెలరోజుల పాటు ఉచితంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్‌తోపాటు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపవచ్చని పేర్కొన్నారు.

పోటీ పరీక్షలకు

సిద్ధమయ్యేలా బోధించాలి

భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా విద్యాబోధన చేయాలని కలెక్టర్‌ తేజాస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జిల్లాలోని మండల విద్యాధికారులు, హెడ్‌ మాస్టర్లు, కాంప్లెక్స్‌ హెడ్మాస్టర్లతో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24 నుంచి జరిగే సమ్మెటివ్‌ ఎగ్జామ్స్‌పై దృష్టి పెట్టి విద్యార్థులు ఎలా ప్రిపేర్‌ కావాలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు 70 శాతానికి తగ్గకూడదన్నారు. పాఠశాలలో సరిగా పాఠాలు చెప్పని ఉపాధ్యాయులను గుర్తించి వారికి నోటీసులు లేదా మెమోలు జారీ చేయాలని డీఈఓ, కోఆర్డినేటర్లు, ఎంఈఓలను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ అశోక్‌, కో–ఆర్డినేటర్లు శ్రావణ్‌, జనార్ధన్‌, రాంబాబు, పూలమ్మ పాల్గొన్నారు.

బీసీల బంద్‌కు సీపీఎం సంపూర్ణ మద్దతు

సూర్యాపేట అర్భన్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్‌ లో పాల్గొంటామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్‌లో జరిగిన ఆ పార్టీ జిల్లా కేంద్ర కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వంపై పోరాడితేనే సమస్యపరిష్కారమవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, వేల్పుల వెంకన్న, మద్దెల జ్యోతి, జె.నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్‌, వీరబోయిన రవి, గుంజ వెంకటేశ్వర్లు, వల్లపుదాసు సాయికుమార్‌, చినపంగి నరసయ్య పాల్గొన్నారు.

పేద పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్యాబోధన

తిరుమలగిరి (తుంగతుర్తి) : పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలందరికీ కార్పొరేట్‌ స్థాయిలో విద్యాబోధన అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను నిర్మిస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. తిరుమలగిరి మండలం తొండలో శుక్రవారం ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ పాఠశాల నిర్మాణం పూర్తయితే 2,500 మంది విద్యార్థులు చదువుకోవచ్చన్నారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇస్తుందని ఆశాభావంవ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఎల్సోజు చామంతినరేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాలెపు చంద్రశేఖర్‌, గుడిపాటి సైదులు, జనార్దన్‌రెడ్డి, డీఈ రమేష్‌కుమార్‌, తహసీల్దార్‌ హరిప్రసాద్‌, ఎంపీడీఓ లాజరస్‌, ప్రత్యేకాధికారి భీమ్‌సింగ్‌, కాంట్రాక్టర్‌ ఏకాంభరం, సులేమాన్‌, మాజీ సర్పంచ్‌ శాతవాహనరావు, లక్ష్మయ్య, జమ్మిలాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement