
మహిళారైతు ఆత్మహత్యా యత్నం
భూములు లాక్కున్నారంటూ..
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి తమ భూములను అక్రమంగా లాక్కున్నారంటూ పలువురు రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. పాఠశాలకు భూమి పూజ చేసేందుకు ఎమ్మెల్యే వస్తున్నట్లు తెలుసుకున్న రైతులు ఆ ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. బాధిత మహిళా రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఆమెను అడ్డుకొని పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం ప్రభుత్వం 20.18 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే సర్వే నంబర్ 98లోని రెండెకరాల భూమిని 60 ఏండ్ల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిందని, దానిని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు తీసుకున్నారని చిత్తలూరి సోమయ్య, చిత్తలూరి సురేశ్, కృష్ణ, పోరెండ్ల పెంటమ్మ ఆరోపించారు. పోలీసులు రైతులను అరెస్టు చేసి వ్యాన్‌లో తీసుకెళ్తుండగా మహిళా రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, తమ భూముల్లో నిర్మాణాలు చేపట్ట వద్దని వారు వేడుకున్నారు.