
యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలు ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టి, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
విద్యుదాఘాతంతో
మహిళ మృతి
మిర్యాలగూడ టౌన్: ఇంట్లో దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్లపల్లి గ్రామానికి చెందిన సిరశాల నర్సమ్మ(58) భర్త గతంలోనే మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇంట్లో ఆమె ఒంటరిగానే నివాసముంటోంది. నర్సమ్మ ఇంటికి కొంత దూరంలో ఆమె కుమారుడు లింగయ్యకు నివాసముంటున్నాడు. బుధవారం కూలి పనులను వెళ్లిన నర్సమ్మ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం ఇంటి ఆవరణలో దుస్తులు ఊతికి పక్కనే ఉన్న ఇనుప తీగపై ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయింది. రాత్రివేళ ఎవరూ చూడకపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గురువారం తోటి కూలీలు నర్సమ్మను కూలి పనులకు పిలిచేందుకు ఇంటికి ఆమె వెళ్లగా విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆమె కుమారుడికి సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపారు.
వ్యవసాయ బావిలో పడి
వృద్ధుడు..
అడ్డగూడూరు: వ్యవసాయ బావిలో పడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం జానకీపురం గ్రామ శివారులో గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురం గ్రామానికి చెందిన కట్కూరి లక్ష్మయ్య(86) మంగళశారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా లక్ష్మయ్య ఆచూకీ లభించకపోవడంతో బుధవారం కుటుంబ సభ్యులు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో లక్ష్మయ్య మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం

యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం