
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం
కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో వరి సాగు వివరాలు
భానుపురి (సూర్యాపేట) : వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగానే దొడ్డు, సన్నరకం ధాన్యానికి వేర్వేరుగా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాల్లో రైతులకు మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించారు. ఈ సీజన్‌లో రైతుల నుంచి 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని సివిల్ సప్లయ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
4.82 లక్షల ఎకరాల్లో వరిసాగు
వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 4.82 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం అక్కడక్కడ వరి కోతలు ప్రారంభమయ్యాయి. దాంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా సివిల్ సప్లయ్‌శాఖ ముందస్తుగా ఏర్పాట్లు చేస్తోంది. రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి మోస పోకుండా ఉండేందుకు జిల్లాలో 298 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 168, పీఏసీఎస్ 132, ఇతరులు 36 చొప్పున సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తైన ప్రదేశాల్లో ఉండేలా, రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యంలో తేమశాతం కారణంగా ఇబ్బందులు రాకుండా ప్రతి కేంద్రంలో డ్రయర్లు, ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేస్తున్నారు.
లక్ష్యం 4.30 లక్షల మెట్రిక్ టన్నులు
ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 10.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇందులో సన్నరకం ధాన్యాన్ని రైతులు ఇంటి అవసరాలకు వాడుకుంటారు. దాంతో పాటు ఇతర ప్రైవేటు మార్కెట్లు, మిల్లులకు పోగా 2,36,289 మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దాంతో పాటు 1,94,591 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం అమ్మకానికి రానుంది. ఈ ధాన్యం కొనుగోలుకు 1.07 కోట్ల గన్నీబ్యాగులు అవసరం కాగా ప్రస్తుతం జిల్లాలో 50 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటిని కేంద్రాలు ప్రారంభం నాటికి సమకూర్చనున్నారు.
ఐకేపీ 168
పీఏసీఎస్ 132
ఇతరులు 36
మొత్తం 298
ఫ 298 కేంద్రాల ఏర్పాటుకు
అధికారుల కసరత్తు
ఫ మూడురోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు
ఫ చాలా మండలాల్లో ఇప్పటికే వరి కోతలు షురూ
ఫ ఈ సీజన్ లక్ష్యం
4.30 లక్షల మెట్రిక్ టన్నులు
వానకాలం వరి సాగు : 4.82 లక్షల ఎకరాలు
దిగుబడి అంచనా : 10.30 లక్షల మెట్రిక్ టన్నులు
మార్కెట్‌కు వచ్చేది : 4,30,880 మెట్రిక్ టన్నులు
సన్నరకం : 2,36,289 మెట్రిక్ టన్నులు
దొడ్డురకం : 1,94,591 మెట్రిక్ టన్నులు