
పత్తి రైతులకు ప్రత్యేక యాప్
నాగారం : పత్తి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రీకపాస్ కిసాన్‌శ్రీ యాప్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారానే పత్తి విక్రయాలు చేయాలనే నిబంధన పెట్టింది. పత్తి సాగు చేసిన రైతులు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తమ పేర్లు, సాగు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఇక పత్తి రైతులు చేలల్లో పని చేయడమే కాకుండా ఫోన్‌లో వివరాలు నమోదు చేయడం కూడా నేర్చుకోవాల్సిందే.
యాప్‌లోనే వివరాలు
పత్తి సాగు చేసిన రైతులు తమ వివరాలను కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. తర్వాత ఎక్కడ విక్రయించాలనుకుంటున్నారు?, ఎప్పుడు? ఎంత సరకు? ఏ మార్కెట్? ఏ జిన్నింగ్ మిల్‌కు తెస్తున్నారు? వంటి విషయాలు కూడా పొందుపర్చాలి. పాస్ పుస్తకం వివరాలు, బ్యాంకు ఖాతాను కూడా అందులో యాడ్ చేయాలి. ఈ వివరాలు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేస్తుంది. లేని పక్షంలో పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదు రయ్యే అవకాశం ఉంటుంది.
నిబంధనలు పాటించాలి
రైతులు తమ పత్తితో 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకుండా చూసుకోవాలి. పొడువాటి దూది ఉంటే క్వింటాకు రూ.8,110, మధ్యస్థంగా ఉంటే రూ.7,100 కనీస మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించింది. సూర్యాపేట జిల్లాలో వానకాలంలో 90వేల ఎకరాల్లో పత్తి సాగైంది.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
రైతులు మొదట ‘కపాస్ కిసాన్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని తన ఫోన్ నంబరు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని అందులో ఎంటర్ చేయాలి. తర్వాత చేంజ్ ప్రొఫైల్, రిజిస్టర్ డిటెయిల్స్, బుక్ స్లాట్, భూమి నమోదు, స్లాట్, సేల్స్ వంటి సమాచారం పొందుపర్చాలి. పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తే వారి వివరాలనూ ఇందులో నమోదు చేయాలి.
అవగాహన లేక ఇబ్బందులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌పై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వారు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. దాంతో రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొబైల్ టెక్నాలజీపై అవగాహన లేక అత్యధిక రైతులు అవస్థలు పడే పరిస్థితి ఏర్పడింది.
కపాస్ కిసాన్ ద్వారానే
పత్తి విక్రయాలు
కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు
సాంకేతిక పరిజ్ఞానం లేని
రైతులకు ఇబ్బందులు