
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం
సూర్యాపేటటౌన్ : సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరమని సూర్యాపేట జిల్లా పోలీస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలను ఎదుర్కోవడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు సైబర్ వారియర్స్‌లా పని చేయాలన్నారు. సైబర్ మోసాల పట్ల చుట్టుపక్కల ఉన్న పెద్దలకు విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు సాంకేతికతను ఉపయోగించి వినియోగదారులకు బహుమతుల రూపంలో, లోన్‌ల రూపంలో ఆశ చూపుతూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని వారిని గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ముత్యాలరాజు, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది మహేష్, సైదులు పాల్గొన్నారు.
రేపు గణేష్ నిమజ్జనం
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించాలని భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అనంతుల కృపాకర్, ప్రధాన కార్యదర్శి రంగరాజు రుక్మారావు వెల్లడించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలో దాదాపు 450 విగ్రహాలు ఏర్పాటు చేశారని, నవరాత్రుల పూజలు ఈనెల 4వ తేదీతో ముగుస్తున్నందున 5న గణేష్ నిమజ్జన శోభాయాత్రను నిర్వహించాలని సూచించారు. సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్‌లో విగ్రహాల నిమజ్జనం చేయాలని కోరారు. నిమజ్జన కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ సహకారంతో 14 ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేదాంత భజన మందిరం మట్టి గణపతి పూజలు ముగిసిన తర్వాత ఊరేగింపుగా పూల సెంటర్ వద్ద శోభాయాత్ర మొదలవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, దంతాల రాంబాబు, బైరు వెంకన్న, కార్యదర్శి గండూరి రమేష్, భువనగిరి సృజన్, కారింగుల ఉపేందర్, చేకూరి కృష్ణ, కోడి లింగయ్య, గుండా వెంకన్న, మహంకాళి సోమయ్య, బైరు విజయకృష్ణ పాల్గొన్నారు.
ఈఓగా జయరామయ్య బాధ్యతల స్వీకరణ
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయ నూతన కార్యనిర్వహణ అధికారిగా జిల్లేపల్లి జయరామయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పదేళ్లుగా ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న కుశలయ్య బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో జయరామయ్య వచ్చారు. జయరామయ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఇద్దరు అధికారులను ఆలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.
మట్టపల్లిలో విశేష పూజలు
మఠంపల్లి: మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో బుధవారం విశేష పూజలు చేశారు. ఈసందర్భంగా అర్చకులు ఆలయ ముఖమండపంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం,గర్భాలయంలో శ్రీ మూలవిరాట్‌కు పంచామృతా భిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూ వరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేశారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ ,మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం