
సాహసంతో జీవిద్దాం..
సమాజాన్ని అర్థం చేసుకునేలా..
భానుపురి (సూర్యాపేట): నేటి సమాజంలో బాలికలు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టడానికి బాలికా చైతన్యం పేరిట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ప్రత్యేక చొరవతో జిల్లాలో పక్షం రోజుల క్రితం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చదువుతోనే బాలిక ప్రకాశిస్తుందన్న ఆలోచనతో ‘సవాళ్లను అధిగమిద్దాం.. సాహసంతో జీవిద్దాం’ అనే నినాదంతో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈకార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నెలలో నాలుగు వారాలు.. నాలుగు శాఖల ఆధ్వర్యంలో వివిధ అంశాలపై బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఒక్కో వారం.. ఒక్కోశాఖ.. ఒక్కో కాన్సెప్ట్
జిల్లాలోని ఐసీడీఎస్, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో పాఠశాలల్లో బాలికలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒక్కో శాఖ ఒక్కో వారం ఒక్కో ఆలోచనతో ముందుకు వస్తోంది.
● మొదటి వారం: వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో.. పౌష్టికాహారం, బాలికల ఆరోగ్య సమస్యలు, న్యూట్రిషన్ ఫుడ్, హార్మోనల్ బ్యాలెన్స్ తదితర విషయాలపై శిక్షణ ఇస్తున్నారు.
● రెండోవారం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తారు. హెల్ప్ లైన్ నంబర్లు, సెల్ఫ్ డిఫెన్స్, అనుకోని సమస్య ఎదురైతే ఎలా స్పందించి.. ఎలా రక్షించుకోవాలని..? ఆన్‌లైన్‌లో మోసపోకుండా ఎలా అడ్డుకోవాలి..? అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
● మూడోవారం: విద్యాశాఖ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ఇవ్వనున్నారు.
● నాలుగో వారం: మహిళా శిశు సంక్షేమశాఖ అండ్ చైల్డ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో.. పోక్సో చట్టాలు, సఖి కేసులు, తల్లిదండ్రులు, గురువులను గౌరవించడంపై కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.
జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ‘బాలికా చైతన్యం’
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ చొరవతో శ్రీకారం
ఫ ‘సవాళ్లను అధిగమిద్దాం– సాహసంతో జీవిద్దాం’ అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమం
ఫ ఒక్కో వారం ఒక్కో థీమ్‌తో బాలికలకు అవగాహన
ప్రస్తుత సమాజంలో బాలికలు లైంగిక దాడులు, చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు, ప్రేమ పేరిట మోసాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో వీరికి చదువు ఒక్కటే కాకుండా సమాజంపై పూర్తి అవగాహన కల్పించేలా కలెక్టర్ సరికొత్త ఆలోచన చేశారు. సీ్త్రశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో వారం ఒక్కో కాన్సెప్ట్‌తో జిల్లాలోని గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను గత నెల 19న ప్రారంభించారు. మొదటగా టీచర్లకు వారం రోజుల పాటు శిక్షణ సైతం ఇచ్చారు. అనంతరం ఆయా పాఠశాలల్లో బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు.

సాహసంతో జీవిద్దాం..