
భూ భారతి అర్జీలు త్వరగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లతో వెబెక్స్ ద్వారా భూ భారతి, ప్రజావాణి అర్జీలు, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, మీసేవ సర్టిఫికెట్ల పెండింగ్‌పై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఒకవేళ తిరస్కరణకు గురైన అర్జీలకు సరైన కారణాలను వివరించాలన్నారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి ప్రజావాణిల్లో వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. స్లాట్ బుక్ చేసిన లబ్ధిదారులకు ఆ రోజే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, ఒకవేళ తహసీల్దార్ అందుబాటులో లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ కు ఇన్‌చార్జి ఇవ్వాలన్నారు. పలు ప్రభుత్వ అభివృద్ధి పనులకు కావాల్సిన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని, హైకోర్టు, సివిల్ కోర్టు, లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీలకు సంబంధించిన కోర్టు కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మీసేవ ద్వారా చేసుకున్న ఆదాయ, కుల ధ్రువీకరణ, రెసిడెన్స్‌లాంటి సర్టిఫికెట్లను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు ఆమోదం తెలపాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. పంచాయతీ సెక్రటరీల ద్వారా గ్రామాల వారీగా సమాచారం తీసుకొని ప్రతి ఇంటికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్