
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం
భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మరింతవేగం పెరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు. మొదట్లో లబ్ధిదారులు అంతగా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత అవగాహన పెరిగి బిల్లులు సరిగా రావడంతో ఇంటి నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క ఆగస్టులోనే 1,034 ఇళ్లకు భూమి పూజలు జరగడం విశేషం.
జిల్లాకు 8,744 ఇళ్లు మంజూరు
అసెంబ్లీ ఎన్నిలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. రూ.5లక్షలతో ప్రభుత్వం రూపొందించిన నమునాలో ఇంటిని లబ్ధిదారుడే నిర్మించుకోవాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించారు. ఈ లెక్కన జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలకు 3,500 చొప్పున ఇళ్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 8,744 ఇళ్లు మంజూరయ్యాయి. మొదటగా ఎంపిక చేసిన మండలానికో గ్రామంలో ఇంటి నిర్మాణాలు చేపట్టగా లబ్ధిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇళ్లు మంజూరైనా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రాలేదు.
వేగంగా శంకుస్థాపనలు.. పనులు..!
మొదట మంచి రోజులు లేకపోవడం, ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా ఇందిరమ్మ లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. క్రమంగా ప్రజల్లో అవగాహన రావడం, ఇంటి నిర్మాణాలు బాగానే ఉండడంతో ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. అలాగే బిల్లులు సైతం ఎప్పటికప్పుడు చెల్లిస్తుండడంతో ఇంటి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు దాదాపు రూ.25 కోట్లను వారి అకౌంట్లలో జమ చేశారు. శ్రావణ మాసం రావడంతో ఆగస్టులో భూమి పూజలు ఊపందుకున్నాయి. ఈ నెలలో జిల్లావ్యాప్తంగా 1,034 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటిని మంజూరు చేస్తోంది. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటిని నిర్మించుకునేందుకు ముందుకురావాలి. బిల్లులను సైతం వెను వెంటనే ప్రభుత్వం చెల్లిస్తోంది.
– సిద్ధార్థ, హౌసింగ్ పీడీ
తిరుమలగిరి మండలం కోక్యానాయక్ తండాలో
నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు
గత ఒక్కనెలలోనే 1,034 ఇళ్లకు శంకుస్థాపన
పనులు ప్రారంభమైన చోట
చకచకా నిర్మాణాలు
ఇళ్లు నిర్మించుకునేందుకు
ముందుకు వస్తున్న లబ్ధిదారులు
జిల్లాకు మొత్తం 8,744
ఇళ్లు మంజూరు