
మహిళలకు భద్రత కల్పిస్తాం
సూర్యాపేటటౌన్ : మహిళలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని ఎస్పీ కె.నరసింహ భరోసా ఇచ్చారు. పని ప్రదేశాల్లో అత్యాచార, వేధింపుల నిరోధక చట్టం–2013పై సోమవారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీసు అధికారులు, మహిళా రక్షణ విభాగం సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ అధికారులతో కలిసి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, సమస్యలపై పోలీసు మహిళా సిబ్బంది స్పందించి సహాయ సహకారాలు అందించాలన్నారు. వేధింపులపై మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళా సాధికారత, మహిళా శక్తి, చట్టాల అమలులో మహిళల పాత్ర, పని ప్రదేశంలో వేధింపులను నిరోధించడంలో బాగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ చట్టం ప్రకారం జిల్లా పోలీస్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి ఆధ్వర్యంలో ఒక ఇంటర్నల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఆఫీస్ ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేశారమన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి దయానందరాణి, బేటి బచావో బేటి పడావో నిర్వాహుకురాలు చైతన్య, పోలీసు కార్యాలయం ఏవో మంజు భార్గవి, జిల్లా మహిళా భరోసా సెంటర్ ఎస్‌ఐ మౌనిక, జిల్లా షీ టీమ్స్ ఎస్‌ఐ నీలిమ, భరోసా సెంటర్ లీగల్ అడ్వైజర్ జ్యోతి, కరుణశ్రీ పాల్గొన్నారు.