
‘పరిషత్’ జాబితాకు నోటిఫికేషన్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణతో పాటు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తుది ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్‌ను జారీ చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అందుకు అవసరమైన ఏర్పాట్లపై ఆయా జిల్లా ల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు దృష్టి సారించారు.
6న ముసాయిదా ఓటరు,
పోలింగ్ స్టేషన్ల జాబితా
ఈ నెల 6వ తేదీన ఎంపీడీఓ, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రచురించనున్నారు. 8వ తేదీన జిల్లాస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల, పోలింగ్ కేంద్రాల జాబితాపై సమావేశం నిర్వహించి వారి నుంచి సూచనలు తీసుకోనున్నారు. అదే రోజు మండల స్థాయిలో కూడా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలను ఇతర సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చిన ఫిర్యాదులను 9వ తేదీన పరిష్కరిస్తారు. 10వ తేదీన తుది ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటించనున్నారు.
ఎన్నికలకు సిద్ధంగా..
ఉమ్మడి జిల్లాలో 716 ఎంపీటీసీ, 73 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఈ ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టనుంది. నల్లగొండ జిల్లాలో 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జెడ్పీటీసీ స్థానాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 178 ఎంపీటీసీ స్థానాలు, 17 జెడ్పీటీసీ స్థానాలు, సూర్యాపేట జిల్లాలో 186 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను, పోలింగ్ స్టేషన్లను జిల్లాల అధికారులు ఖరారు చేయనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండేలా ఈ చర్యలు చేపడుతున్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్
ఓటరు జాబితాతో పాటు పోల్చింగ్
కేంద్రాల ఖరారుకు షెడ్యూల్
ఉమ్మడి జిల్లాలో 716 ఎంపీటీసీ,
73 జెడ్పీటీసీ స్థానాలు