యూరియా ఏది? | - | Sakshi
Sakshi News home page

యూరియా ఏది?

Sep 2 2025 7:41 PM | Updated on Sep 2 2025 7:41 PM

యూరియా ఏది?

యూరియా ఏది?

ఒకటి, రెండు బస్తాలే.. దిగుబడి తగ్గే అవకాశం నాటు వేసి.. నెల రోజులవుతోంది వరి ఎదుగుదల లేదు రోజుకో బస్తా ఇస్తే ఎలా

అదును దాటుతోంది..

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యూరియా కోసం రైతులు తంటాలు పడుతున్నారు. సరైన సమయంలో వర్షాలు కురవడంతో పత్తి, వరి, పండ్ల తోటలకు యూరియా పెట్టుకునేందుకు ఇదే సరైన అదును. నాన్‌ ఆయకట్టు ప్రాంతంలో వరితోపాటు పత్తికి యూరియా వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆయకట్టు ప్రాంతంలో ప్రస్తుతం వరి నాట్లు వేస్తుండటంతో యూరియా అవసరం అధికంగా ఉంది. అందరికీ ఒకేసారి యూరియా అవసరం రావడం.. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. చివరకు అర్ధరాత్రులు యూరియా కోసం పీఏసీఎస్‌ కేంద్రాల వద్దే పడుకోవాల్సిన దుస్థితి దాపురించింది.

ఆందోళన, ధర్నాలు..

ప్రస్తుతం పంటలకు అవసరమైన యూరియా కోసం రైతులు పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ కేంద్రాల వద్ద బారులు దీరుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నిత్యం ఏదో ఒక మండలంలో రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తూనే ఉన్నారు. సోమవారం నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి పీఏసీఎస్‌ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు చివరకు నార్కట్‌పల్లి–అద్దంకి జాతీయ రహదారిపై రస్తారోకో చేపట్టారు. ఇక పెద్దవూర, నిడమనూరు మండల కేంద్రాల్లోనూ రైతులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. తిప్పర్తి, శాలిగౌరారం, హాలియా మండలంలోనూ యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దవూర, హాలియాలోలోని కొత్తపల్లి పీఏసీఎస్‌ల వద్ద యూరియా కోసం రాత్రి వేళల్లోనూ అక్కడే నిద్రిస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా నడిగూడెంలో, ఆత్మకూరు(ఎస్‌) మండలాల్లో యూరియా కోసం ఆందోళన నిర్వహించగా, మద్దిరాల తదితర మండలాల్లో పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ కేంద్రాల వద్ద బారులుదీరారు.

అవసరానికి సరిపడా అందని యూరియా..

● నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 10.73 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. ప్రధానంగా 5,64,585 ఎకరాల్లో పత్తి, 5,05,160 ఎకరాల్లో వరి, 156 ఎకరాల్లో జొన్న, 2951 కంది, 310 పెసర, ఇతర పంటలను సాగు చేశారు. జిల్లాలొ వానాకాలం సీజన్‌ పంటలకు సెప్టెంబర్‌ వరకు 70 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 53 మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

● సూర్యాపేట జిల్లాలో 5,73,006 ఎకరాల్లో పంటలు సాగుచేశారు. అందులో వరి 4.82 లక్షల ఎకరాల్లో, 84 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఆయా పంటలకు జిల్లాలకు 60,734 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరముంది. అయితే ఇప్పటివరకు 42 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది.

మరోవైపు ప్రభుత్వం ప్రతి ట్రిప్‌లో జిల్లాకు కేవలం 2 నుంచి 3 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో వచ్చిన యూరియా వచ్చినట్లు అయిపోతోంది. మరోవైపు రైతులకు కేవలం ఒకటి, రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతులు పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ సేవా కేంద్రాలు, ఎన్‌డీసీఎంఎస్‌ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. సమయానికి యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి.. పెట్టిన పెట్టుబడులు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రైతు పెంటబోయిన వెంకటేశ్వర్లు. ఈయనది తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని రాజవరం. నాలుగు ఎకరాల్లో వరి నాట్లు వేసి 15 రోజులు కావస్తో్‌ంది. ఇప్పటి వరకు యూరియా లభించకపోవడంతో చల్లలేదు. మూడు రోజులుగా యూరియా కోసం

తిరుగుతున్నా ఒక్కటీ లభించలేదు. దీంతో యూరియా లేక, పంట ఎదుగుదుల తగ్గిపోయి, దిగుబడి కోల్పోయే ప్రమాదం ఉందని, పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని

ఆందోళన చెందుతున్నాడు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న రైతు పేరు వడ్లపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి.

ఇతనిది పెద్దవూర మండలం ఏనేమీదిగూడెం. వానాకాలం సీజన్‌లో 25 ఎకరాలలో వరి సాగు చేశాడు. ఎకరాలకు బస్తా చొప్పున ప్రస్తుతం 25 బస్తాల యూరియా కావాలి. తొలి విడతలో ఫర్టిలైజర్‌లో ఎక్కువ డబ్బులు చెల్లించి కొనుగోలు చేశాడు. ఇప్పుడు

ఫర్టిలైజర్‌ షాపుల్లో యూరియా దొరకడం లేదు. దీంతో వ్యవసాయ పనులను వదులుకుని మూడు రోజులుగా పెద్దవూర పీఏసీఎస్‌కు తెల్లవారక ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నాడు. రెండు రోజులు రెండు బస్తాల చొప్పున నాలుగు బస్తాలు, సోమవారం ఒక బస్తా మాత్రమే లభించింది. ఇంకా 20 వస్తాలు కావాలంటే.. ఇలా ఎన్ని రోజులు వేచి ఉండాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మాకున్న ఏడెకరాలతోపాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేశా. రెండు వారాలుగా సహకార సొసైటీ చుట్టూ తిరుగుతున్నా 5 బస్తాల యూరియా మాత్రమే దొరికింది. మరో 7 బస్తాల యూరియా కావాలి. కూలీల కొరతతో కలుపు నివారణకు రసాయన మందుల వాడకం పెరిగింది. దీంతో మొక్క ఎండు బారి, పెరుగుదల లోపిస్తోంది. దీంతో యూరియా వేయడం తప్పనిసరి అవుతోంది. యూరియా లేకపోవడంతో దిగుబడి తగ్గుతుంది. – బుసిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, నిడమనూరు

మాది సోమవారిగూడెం చెరువు, ఏఎమ్మార్పీ సాగు నీటితో మూడు ఎకరాలు వరి సాగు చేశాను. నాటేసి నెలరోజులవుతోంది. ఒక్క దఫా కూడా యూరియా వేయలేదు. పంటను చూస్తే దుఃఖం వస్తోంది. సకాలంలో యూరియా వేస్తేనే వరి దుబ్బు, పిలకలు వచ్చి, దిగుబడి వస్తుంది.

– సింగం రామలింగయ్య, సోమవారిగూడెం, నిడమనూరు మండలం

నేను 11ఎకరాల్లో వరి సాగు చేశా. యూరియా కోసం వారం రోజులుగా తిరుగుతున్నా. అయినా దొరకడం లేదు. అదును దాటిపోతోంది. యూరియా వేయపోవడంతో పొలం ఎదుగుదల లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

– ఎం.సత్తయ్య, రైతు, రాయినిగూడం, తిప్పర్తి

వానాకాలం సీజన్‌లో తన భూమితో పాటు కౌలుకు తీసుకుని 14 ఎకరాలలో వరి నాట్లు వేశాను. ప్రస్తుతం యూరియా అవసరం ఏర్పడింది. ఒక్కరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. సోమవారం రెండు లారీల యూరియా వస్తుందని అధికారులు చెప్పడంతో ఇంట్లోని ముగ్గురం తెల్లవారక ముందే పీఏసీఎస్‌కు వచ్చాం. క్యూలో నిల్చుంటే ఒకొక్కరికి ఒక బస్తా మాత్రమే ఇచ్చారు. రోజు ఒక బస్తా ఇస్తే ఎన్నిరోజులు తిరగాలి.

– కొలుపుల సంతు, పోతునూరు, పెద్దవూర మండలం

ఫ వరి, పత్తి, పండ్ల తోటలకు ఒకేసారి ఎరువులు అవసరం

ఫ ఈ సమయంలోనే దొరకని యూరియా

ఫ దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతుల ఆందోళన

ఫ రోజుల తరబడి తప్పని ఎదురుచూపులు

ఫ అర్ధరాత్రి కూడా పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement