
మట్టపల్లిలో గరుడ వాహన సేవ
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామి, అమ్మవారిని అర్చకులు సోమవారం గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అంతకు ముందు శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేశారు. నూతన పట్టు వస్త్రాలంకరణ చేసి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కాగా క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ మహారుద్రాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, సీతారామాచార్యులు, చీకూరిరాజేష్ పాల్గొన్నారు.