
ఉలిక్కిపడ్డ భానుపురి
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జ్యువెలరీ షాపులో ఆదివారం రాత్రి జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. దొంగలు జ్యువెలరీ షాపునకు కన్నం వేసి 8కిలోల బంగారం చోరీచేయడంతో బంగారం షాపు నిర్వాహకులతో పాటు పట్టణంలో ఇతర వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. సూర్యాపేట పట్టణంలో ప్రధాన రోడ్డు అయిన ఎంజీ రోడ్డులోని శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో దొంగతనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ కూడా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఇంత పెద్ద దొంగతనం జరగలేదు. 2011లో సూర్యాపేటలోని పూల సెంటర్ రోడ్డులో ఓ బంగారం షాపులో కిలో బంగారాన్ని అప్పట్లో దొంగలు ఎత్తుకుపోయారు. అప్పటి నుంచి అంత పెద్ద మొత్తంలో దొంగతనాలు జరగలేదు. తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏకంగా ఎనిమిది కిలోల బంగారం చోరీకి గురికావడం కలకలం సృష్టించింది. భారీ దొంగతనం కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. జిల్లా కేంద్రంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదు. రాత్రి వేళల్లో సైతం పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
కొత్త షాపు పెట్టేందుకు
ఎక్కువ మొత్తంలో కొనుగోలు
సూర్యాపేటకు చెందిన తెడ్ల కిషోర్ పదమూడు సంవత్సరాలుగా బంగారం వ్యాపారం చేస్తున్నాడు. మొదటగా జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో బంగారం షాపు నిర్వహిస్తుండగా ఆ తర్వాత ఐదేళ్ల క్రితం షాపును ఎంజీ రోడ్డుకు మార్చాడు. ఎక్కువగా ముంబై, హైదరాబాద్ నుంచి బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇటీవల మరో బంగారం షాపు పెట్టేందుకు భారీగా బంగారం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ బంగారాన్ని షాపులోని లాకర్ రూంలో గల అల్మారాలో భద్రపరిచాడు. ప్రస్తుతం శ్రీసాయి జ్యువెలరీ షాపు నిర్వహిస్తున్న మడిగె అద్దెకు తీసుకున్నది. తాను సొంతంగా కొత్తగా భవనాన్ని నిర్మించాడు. వచ్చే నెలలో ఈ షాపును తన సొంత భవనంలోకి మార్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కొత్త షాపులో పెట్టేందుకు సుమారు 16కిలోలకు పైగా బంగారం కొనుగోలు చేసినట్టు వ్యాపారి కిషోర్ చెబుతున్నాడు.
కొనుగోలు చేసిన రెండు వారాలకే చోరీ..
షాపు నిర్వాహకుడు కిషోర్ అధిక మొత్తంలో బంగాారం కొనుగోలు చేసి తీసుకువచ్చి షాపులో పెట్టిన రెండు వారాలకే దొంగతనం జరగడం గమనార్హం. ఇది తెలిసిన వారి పనేనా అనే అనుమానం కలుగుతోంది.
పది రోజుల క్రితమే లాకర్ మార్పు..
ఇంతకాలం నడిపించిన షాపులో ఉన్న లాకర్‌ను పది రోజుల క్రితమే తన సొంత భవనంలో మార్చాడు. అయితే ఆ షాపు ఇంకా ఓపెన్ కాకపోవడంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన బంగారాన్ని షాపులోని లాకర్ గదిలో అల్మారాలను ఏర్పాటు చేసుకొని ఆ గదికి షెట్టర్ చేయించాడు. మరో పది రోజుల్లో షాపు మార్చాక బంగారం తీసుకెళ్లొచ్చనే భావనతో యజమాని ఉన్నాడు. ఇంతలోనే చోరీ జరగడంతో లబోదిబోమంటున్నాడు. బంగారం 16కిలోలకు పైగా ఉండగా అందులో ఎనిమిది కిలోల బంగారం, రూ.18లక్షల నగదును మాత్రమే ఎత్తుకెళ్లారు. వెండిని ముట్టుకోలేదు. అలాగే షాపులో నుంచి లాకర్ గదికి వచ్చే డోర్‌ను వెనుకాల నుంచి గడియ పెట్టి పరారయ్యారు.
సూర్యాపేటలో జ్యువెలరీషాపును కొల్లగొట్టిన దుండగులు
కోట్లు విలువ చేసే బంగారం అపహరణ
విషయం తెలియడంతో
వ్యాపారుల్లో ఆందోళన
ఉమ్మడి జిల్లాలో
ఇంత పెద్దదొంగతనం ఇదే..
చర్చనీయాంశంగా మారిన భారీ చోరీ

ఉలిక్కిపడ్డ భానుపురి