
‘దొడ్డా’ జీవితం ఆదర్శం
చిలుకూరు: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దివంగత దొడ్డా నారాయణరావు జీవితం అందరికీ ఆదర్శం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సోమవారం చిలుకూరు మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయం వద్ద ప్రముఖ వైద్యుడు జాస్తి సుబ్బారావు ఆధ్యక్షతన నిర్వహించిన దొడ్డా నారాయణరావు సంతాప సభలో కూనంనేని పాల్గొని మాట్లాడారు. నాటి స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మద్యపాన నిషేధ ఉద్యమం వరకు పోరాటంసాగించిన మహోన్నత వ్యక్తి దొడ్డా అని కొనియాడారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దొడ్డా నారాయణరావు మరణం సీపీఐకి తీరనిలోటు అని అన్నారు. క్రమ శిక్షణ గల నాయకుడిగా మంచి పేరు సంపాదించారన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మాట్లాడుతూ దొడ్డా నారాయణరావు ఆశయ సాధనకు తాను కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం తన తుది శ్వాస వరకు పోరాడినయోధుడు దొడ్డా నారాయణరావు అని పేర్కొన్నారు. ముందుగా నారాయణరావు ప్రతిమతో ఉన్న శిలాఫలకాన్ని కూనంనేని , చాడ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, బొల్లం మల్లయ్య యాదవ్, సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు, గన్నా చంద్రశేఖర్, బొమ్మగాని ప్రభాకర్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పార్టీ కార్యదర్శులు బెజవాడ వెంకటేశ్వర్లు, దండు సురేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, తెలుగు అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, సీపీఐ మండల కార్యదర్శి, సహాయ కార్యదర్శులు మండవ వెంకటేశ్వర్లు, సాహెబ్ అలీ పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు

‘దొడ్డా’ జీవితం ఆదర్శం