
బాధితులకు అండగా ఉంటాం
సూర్యాపేటటౌన్ : ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
పీఈటీఏ టీఎస్
జిల్లా కార్యవర్గం ఎన్నిక
సూర్యాపేట : వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ స్టేట్(పీఈటీఏ టీఎస్) జిల్లా కార్యవర్గాన్ని సోమవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతుంది. సంఘం జిల్లా అధ్యక్షుడిగా అయితగోని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గంధం రంగారావు, కోశాధికారిగా సన్నీళ్ల యాదయ్య, మహిళా ఉపాధ్యక్షురాలిగా పార్వతి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడు చంద్రయ్య , అబ్జర్వర్లుగా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కోశాధికారి శక్రు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ రత్నం వ్యవహరించారు.
నృసింహుడికి
లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశి సందర్భంగా సోమవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలోని ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి, అర్చకులు వేదమంత్రాలతో శ్రీస్వామివారిని కొలుస్తూ తులసీ దళాలతో లక్ష పుష్పార్చన చేశారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనలు చేశారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం, వెండి జోడుసేవ ఊరేగింపు తదితర వేడుకలతో ఆలయం సందడిగా మారింది.