
సూర్యాపేటటౌన్: ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ జరిగింది. 8 కిలోల బంగారం, ఆభరణాల తోపాటు రూ.18 లక్షల నగదును దొంగలు అపహరించారు. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ రూ.7.20 కోట్లు ఉంటుందని యజమాని అంటున్నారు. సూర్యాపేటకు చెందిన తెడ్ల కిషోర్ పట్టణంలోని ఎంజీ రోడ్డులో శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. కిషోర్ సోమవారం ఉదయం 9 గంటలకు దుకాణం తెరిచి లాకర్ గదిలోకి వెళ్లి చూడగా గోడకు పెద్ద రంధ్రం చేసి ఉంది. లాకర్ రూంకు ఉన్న షట్టర్ కట్ చేసి ఉంది. దీంతో దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు.
తెలిసినవారా.. ప్రొఫెషనల్ ముఠానా?
దొంగలు పక్కా స్కెచ్‌తో బంగారం షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం దుకాణం మెయిన్ రోడ్డుకు ఉంటుంది. దొంగలు షాపు వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో నుంచి వచ్చి బాత్రూంలోకి వెళ్లి తలుపును కట్ చేసి అందులో నుంచి లాకర్ రూంలోకి వెళ్లారు. లాకర్ రూం షట్టర్‌ను గ్యాస్ కట్టర్‌తో తొలగించి లోనికి ప్రవేశించి బీరువాలో ఉన్న 8 కిలోల బంగారం, ఆభరణాలతోపాటు రూ.18 లక్షల నగదు అపహరించారు. ఈ చోరీని ప్రొఫెషనల్ దొంగల ముఠా చేసిందా లేక తెలిసిన వ్యక్తులే చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంత పకడ్బందీగా.. బాత్రూం నుంచి వెళితే లాకర్ గది వస్తుందని దొంగలకు ఎలా తెలుస్తుందని పోలీసులు ఆరా తీస్తున్నారు. బాత్రూంలో నుంచి లోపలికి ప్రవేశించే ముందు అక్కడున్న జగ్గుతో సీసీ కెమెరాను మూసేశారు. లాకర్ గదిలోని రెండు బీరువాల్లో ఒక్కోదాంట్లో 8 కిలోల చొప్పున 16 కిలోల బంగారం ఉండగా.. ఒక బీరువాలోని 8 కిలోల బంగారాన్ని మాత్రమే ఎత్తుకెళ్లారు. దొంగలు గ్యాస్ కట్టర్, రెండు సిలిండర్లను అక్కడే వదిలేశారు. సిలిండర్‌పై ఉన్న నంబర్ ఆధారంగా దాన్ని కోదాడలో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బంగారం షాపు వెనకాల ఖాళీ స్థలంలో రెండు తులాల రింగ్, చెవి దుద్దులు పడిపోగా వాటిని స్వాధీనం చేసుకున్నారు.
మూడు రోజులుగా రెక్కీ
ముగ్గురు వ్యక్తులు మూడు రోజుల క్రితం దుకాణం పక్క సందులో ఉన్న బాలాజీ గ్రాండ్ హోటల్ సమీపంలో రూంను అద్దెకు తీసుకున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురు బంగారు షాపులో దొంగతనం చేసేందుకు మూడు రోజులుగా రెక్కీ నిర్వహించినట్టు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆదివారం రాత్రి కూడా ఈ ముగ్గురు వ్యక్తులు రెండు గ్యాస్ సిలిండర్లు, కట్టర్ పట్టుకొని బాలాజీ గ్రాండ్ హోటల్ సందులో నుంచి నడుచుకుంటూ వెళ్లినట్టు తెలుస్తోంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అక్కడ ఆధారాలను సేకరించాయి. దొంగలు ఆదివారం రాత్రి 12.09 గంటలకు షాపులోపలికి వచ్చినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డయింది. బంగారు షాపును సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం పరిశీలించారు. కేసును ఛేదించడానికి ఐదు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దొంగలను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
సెక్యూరిటీ ఎందుకు లేదు..
బంగారు షాపు యజమాని అంత పెద్ద మొత్తంలో షాపులో బంగారాన్ని పెట్టి కనీసం సెక్యూరిటీ గార్డ్‌ను కూడా పెట్టకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. లాకర్‌కు అలారం సిస్టం కూడా ఏర్పాటు చేసుకోలేదు. జ్యువెలరీ షాపు యజమాని కిషోర్ అక్కడికి సమీపంలో మరో దుకాణాన్ని ఏర్పాటుచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందులో భాగంగానే పెద్దమొత్తంలో బంగారం, ఆభరణాలు తీసుకొచ్చి ప్రస్తుత షాపులో పెట్టాడని అంటున్నారు.