భువనగిరిటౌన్: కేంద్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్‌బీవై)ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా సంవత్సరానికి రూ.20 కట్టడం ద్వారా రూ.2లక్షల బీమా పొందవచ్చు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఈ బీమాకు అర్హులు. అయితే ఇందు కోసం ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు ఉంటే.. ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఖాతా ఉంటే.. ఆ ఖాతాలో పేర్లు ఉన్నవారందరూ ఈ పథకంలో చేరడానికి అర్హులు అవుతారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా ఈ పథకంలో చేరేందుకు అర్హులు. కానీ క్లెయిమ్ మాత్రం లబ్ధిదారుడికి లేదా నామినీకి భారత కరెన్సీలో చెల్లిస్తారు.
ప్రీమియం ఎంత చెల్లించాలి అంటే..
పీఎంఎస్‌బీవై పథకంలో వార్షిక ప్రీమియంగా కేవలం రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ తర్వాత ఆటోమెటిక్‌గా బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియంను కట్ చేస్తారు. దీని కాలపరిమితి ఒక సంవత్సరం. ఏటా దీనిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఒకటి లేదా అంత కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ పథకంలో చేరినట్లయితే.. క్లెయిమ్ సమయంలో కేవలం ఒక బ్యాంకు అకౌంట్‌కు మాత్రమే బీమా చెల్లిస్తారు. అంటే ఇతర బ్యాంకు అకౌంట్ల ద్వారా చెల్లించిన ప్రీమియాన్ని కోల్పోవాయినట్లే అవుతుంది. బీమా క్లెయిమ్ చేస్తే ప్రీమియం మారుతూ ఉంటుంది. ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే మొదటి మూడేళ్లలో ప్రీమియంలో ఎలాంటి మార్పులు ఉండవు. బ్యాంకులు ఈ పాలసీకి సంబంధించిన ఎలాంటి పాలసీ సర్టిఫికెట్లు జారీ చేయవు.
బీమా వర్తించే సందర్భాలు..
సహజ విపత్తుల వల్ల జరిగిన ప్రమాదాల వల్ల మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం వర్తిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సందర్భాల్లో వారి కుటుంబానికి కూడా ఎలాంటి బీమా ప్రయోజనం లభించదు. ఒకవేళ చందాదారుడు హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజ్ లభిస్తుంది. ప్రమాదవశాత్తు చందాదారుడు మరణిస్తే, మరణాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించాలి. అప్పుడు మాత్రమే పీఎంఎస్‌బీవై పథకం కింద క్లెయిమ్ మంజూరు అవుతుంది. ఒకవేళ రోడ్డు, రైలు, ఏదైనా వాహన ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురికావడం లాంటి మరణాలు సంభవిస్తే.. వాటిని పోలీసుల ధ్రువీకరించాలి. అలాగే పాము కాటు, చెట్టుపై నుంచి కిందపడి చనిపోతే.. ఆ మరణాలను వైద్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అప్పుడే మాత్రమే ఈ పథకం ద్వారా క్లెయిమ్ లభిస్తుంది. చందాదారుడు మరణించిన సందర్భంలో అభ్యర్థన నమోదు పత్రం ప్రకారం నామినీ క్లెయిమ్ కోసం దాఖలు చేయవచ్చు. ఒకవేళ నామినీ పేరును అభ్యర్థన నమోదు పత్రంలో తెలుపకపోతే అప్పుడు చందాదారుని చట్టపరమైన వారసుడు క్లెయిమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు. మరణించిన వారి తరఫు క్లెయిమ్‌లు నామినీ, చట్టపరమైన వారసుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. అదే వైకల్యం తాలూకా క్లెయిమ్‌లు మాత్రం చందాదారుడి బ్యాంకు ఖాతాలో జమవుతాయి.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనతో
భవిష్యత్తుకు భరోసానిస్తున్న కేంద్ర ప్రభుత్వం
లబ్ధి పొందేది ఇలా..
ఈ బీమా పథకంలో చేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైనా బాధిత కుటుంబానికి లేదా నామినీకి రూ.2,00,000 అందిస్తారు. ఒక వేళ పాలసీదారుడు పాక్షిక వైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం అందిస్తారు. ప్రమాదంలో రెండు కళ్లు పూర్తిగా కోల్పోయినా లేదా రెండు చేతులు లేదా కాళ్లు కోల్పోయినా.. దానిని శాశ్వత వైకల్యంగా గుర్తించి రూ.2 లక్షలు పరిహారంగా అందిస్తారు. ఒక కాలు లేదా ఒక చెయ్యి, ఒక కంటి చూపు కోల్పోతే మాత్రం దానిని పాక్షిక వైకల్యంగా గుర్తించి రూ.లక్ష రూపాయలు పరిహారంగా ఇస్తారు.