
గరుడ టికెట్‌తో శీఘ్ర దర్శనం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేలా ఆలయాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళ రూ.300 టికెట్‌తో బ్రేక్ దర్శనం పేరిట ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు. ఇదే మాదిరిగా ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారిని అంతరాలయంలో దర్శించుకునే విధంగా గరుడ టికెట్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమల శ్రీవాణి ట్రస్టు తరహాలో..
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం భక్తులకు శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.10,500 టికెట్‌ను అందిస్తున్నారు. ఇదే తరహాలో యాదగిరిగుట్టలో సైతం ఒక్కో భక్తుడికి రూ.5,000తో గరుడ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రముఖులు, ఎన్‌ఆర్‌ఐలు, విదేశీయులతో పాటు సామాన్య భక్తులు సైతం క్యూలైన్లలో గంటల తరబడి నిల్చునేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ గరుడ టికెట్‌ను ప్రవేశపెడితే తొందరగా, సులవుగా దర్శనం కావడంతో పాటు దేవాలయానికి ఆదాయం సైతం పెరగనుంది. ఈ టికెట్ కొనుగోలు చేసే భక్తులకు 5 అభిషేకం లడ్డూలు, కిలో పులిహోర ప్రసాదాన్ని సైతం అందజేయనున్నారు. అంతేకాకుండా ఆశీర్వచనం సైతం చేయనున్నారు. గరుడ టికెట్ కొనుగోలు చేసిన భక్తులు ఉదయం ఆలయం తెరిచినప్పటి నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా అంతరాలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు.
తిరుమల శ్రీవాణి ట్రస్టు
తరహాలో యాదగిరిగుట్టలో
ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు
ఒక్కో టికెట్ ధర రూ.5వేలు
వ్రత టికెట్ల ధర పెంపు..
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తులు సత్యనారాయణస్వామి వ్రతం జరిపించేందుకు గాను ప్రస్తుతం టికెట్ ధర రూ.800 ఉండగా.. దానిని రూ.1,000కి పెంచుతూ ఆలయ ఈఓ వెంకట్రావ్ ఇటీవల నిర్ణయించారు. ఈ రూ.1000 టికెట్ కొనుగోలు చేస్తే.. ప్రస్తుతం సత్యనారాయణ వ్రతం జరిపించడానికి ఆలయం తరఫున భక్తులకు అందజేస్తున్న వ్రత సామగ్రితో పాటు స్వామివారి ప్రతిమ, శెల్లా, కనుమను అదనంగా ఇవ్వనున్నారు. ప్రతి రోజు వ్రత మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు బ్యాచ్‌ల్లో 350 నుంచి 450 వ్రతాలు జరుగుతాయి. ఆదివారాలు, సెలవు రోజుల్లో మరో 100 వ్రతాలు అదనం. ప్రస్తుతం రూ.800 టిక్కెట్‌తో రోజుకు రూ.3లక్షల వరకు ఆదాయం వస్తుండగా.. రూ.1000కి ధర పెంచడంతో అదనంగా మరో రూ.90వేలు రోజుకు ఆదాయం అదనంగా రానుంది.