
ఒక కుటుంబం.. ఒకే వార్డు
సూర్యాపేట : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చినా నిర్వహించేలా జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో రూపొందించిన జాబితా ఆధారంగా పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల లెక్క తేల్చారు. అందుకు అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో వార్డులను విభజించారు. ఇటీవల కొందరు కొత్తగా ఓటుహక్కు పొందారు. మరికొందరు ఓటర్లు మరణించారు. చేర్పులు, మార్పుల కారణంగా నూతన జాబితాను ప్రచురించారు. కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ఒకటో వార్డు నుంచి చివరి వార్డు వరకు జాబితాను సవరించనున్నారు. ఎన్నికల నాటికి మళ్లీ కొత్త ఓటర్ల నుంచి చేర్పులు, మార్పులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే వారి వివరాలతో వార్డుల వారీగా అనుబంధ జాబితాను రూపొందించే అవకాశముంది. దీనినే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పరిగణనలోకి తీసుకోనున్నారు.
గ్రామం యూనిట్‌గా..
ఇప్పటివరకు మండలం యూనిట్‌గా అన్ని గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను ఎంపీడీఓ లాగిన్‌తో టీపోల్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తపరిచారు. పంచాయతీ కార్యదర్శి స్థాయిలో గ్రామం యూనిట్‌గా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించాలని తాజాగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈమేరకు కొత్త జాబితాను సిద్ధం చేసి కార్యదర్శి లాగిన్ ద్వారా టీపోల్‌లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ జాబితాను ఎంపీడీఓ పరిశీలించి డీపీఓకు పంపిస్తారు.
ఉద్యోగుల వివరాల సేకరణ
సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేశారు. ఎంతమంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓ), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌ఓ), పోలింగ్ సిబ్బంది అవసరమో గుర్తించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఇటీవల కొండరు ఉద్యోగులు బదిలీ అయ్యారు. వేరే ప్రాంతాల నుంచి ఇంకొందరు ఇక్కడికొచ్చారు. వారిలో ఎవరెవరు ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, పోలింగ్ సిబ్బందో గుర్తించి వారి వివరాలను టీపోల్‌లో నమోదు చేస్తున్నారు.
ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నాం
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నాం. గ్రామం యూనిట్‌గా పంచాయతీ కార్యదర్శి లాగిన్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం.
– యాదగిరి, డీపీఓ
ఫ వేర్వేరు వార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యుల ఓట్లు ఒక్కచోటకు..
ఫ గ్రామం యూనిట్‌గా ఓటరు జాబితా రూపకల్పనకు అధికారుల కసరత్తు
ఫ టీ పోల్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం