
పిల్లల భవిష్యత్ మార్చేది ఉపాధ్యాయులే..
ఖమ్మం సహకారనగర్: పిల్లల భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి తరగతి గదిలో విద్యార్థులతో మమేకమవుతూ పాఠాలు బోధించాలని సూచించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం ఆమె ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ పాఠశాలలకు వచ్చే పిల్లలకు నేర్పించేదే వారి జీవితంలో కీలకంగా మారుతుందన్నారు. ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. డీఈఓలు, ఎంఈఓలు తరచూ పాఠశాలలను తనిఖీ చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరును ఫేస్ రికగ్నిషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్) ద్వారా నమోదు చేయాలన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు సెప్టెంబర్ నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించి స్నాక్స్ సమకూర్చాలని సూచించారు. అనంతరం విద్యా శాఖ సంచాలకుడు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్, జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడగా ఎస్సెస్సీలో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన, మూతబడిన స్కూళ్లు తెరిపించిన, అత్యధికంగా విద్యార్థులను చేర్పించిన ఎంఈఓలను సన్మానించారు. ఈ సమీక్షలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రెయినీ కలెక్టర్ సౌరభశర్మ, విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు రమణకుమార్, రాజీవ్, సత్యనారాయణరెడ్డి, మదన్‌మోహన్, వెంకటనర్సమ్మ, డాక్టర్ హెచ్.హరీష్, మంజరి, డీఈఓ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
ఫ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా