యథేచ్ఛగా లింగ నిర్ధారణ! | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా లింగ నిర్ధారణ!

Jul 26 2025 10:08 AM | Updated on Jul 26 2025 10:08 AM

యథేచ్

యథేచ్ఛగా లింగ నిర్ధారణ!

మెడికల్‌ షాపులే అడ్డాగా గుట్టుగా పరీక్షలు

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జైలుకే..

స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ప్రీ–నేటల్‌ డయాగ్నోస్టిక్‌ టెక్నిక్స్‌ చట్టం ప్రకారం పదేళ్లకు పైబడిన జైలుశిక్ష, జరిమానాలు ఉంటాయి. ఇలాంటి వాటిపై స్థానిక పోలీసులకు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలి. ఆర్‌ఎంపీలు బాధ్యతగా వ్యవహరించాలి.

– కె.నరసింహ, ఎస్పీ, సూర్యాపేట

సూర్యాపేటటౌన్‌ : లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కొందరు సొంతంగా స్కానింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసుకొని పుట్టబోయేది ఆడబిడ్డా.. మగ పిల్లోడా అని తేల్చి చెబుతున్నారు. ఆడపిల్ల అని తెలిసి కొందరు గుట్టుగా గర్భస్రావం (అబార్షన్‌) చేయించుకుంటూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. లింగ నిర్ధారణ మొదలు, అబార్షన్ల వరకు జిల్లా అంతటా ఈ దందా కొనసాగుతున్నా.. వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమశాఖలు క్షేత్రస్థాయిలో నిరంతర తనిఖీలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాసులకు కక్కుర్తిపడి..

జిల్లాలో పలు స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి లింగ నిర్ధారణ పరీక్షలు చేసేస్తున్నారు. కడుపులో పెరిగేది ఆడా.. మగా అనే విషయాన్ని గర్భిణికి ఐదో నెలలోనే చెబుతున్నారు. ఈ క్రమంలో రూ.వేలకు వేలు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని చిన్న ఆస్పత్రులు, ప్రథమ చికిత్స కేంద్రాల్లో ఎక్కువ శాతం అబార్షన్లు జరుగుతున్నాయి. ఇందులో కొందరు ఆర్‌ఎంపీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేటలో వైద్యులు లేకుండానే పలు ఆస్పత్రుల్లో ఈ తంతు నిత్యకృత్యంగా మారడం గమనార్హం.

మెడికల్‌ షాపులోనే స్కానింగ్‌ దందా..

జిల్లాలో స్కానింగ్‌ సెంటర్లతో పాటు మెడికల్‌ షాపుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్‌ రోడ్డులో ఓ మెడికల్‌ షాపులో ఏకంగా స్కానింగ్‌ మిషన్‌ పెట్టిన ఇద్దరు వ్యక్తులు గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు బట్టబయలైంది. కాగా వారిద్దరిని పోలీసులు పట్టుకొని విచారిస్తున్నారు. అయితే అందులో ఓ వ్యక్తి ఒక ప్రైవేట్‌ ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌గా వ్యవహరిస్తూ ఆర్‌ఎంపీల మధ్యవర్తిత్వంతో సీక్రెట్‌గా చర్చి కాంపౌండ్‌లో ఉన్న మరో వ్యక్తి మెడికల్‌ షాపులో లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్ష చేస్తే రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.

అబార్షన్‌ కోసం వెళ్లి ప్రాణాల మీదకు..

ఆడపిల్ల అని తెలిస్తే వెంటనే అబార్షన్‌ చేసుకునేందుకు కొందరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రెండు నెలల క్రితం మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఐదో నెలలో లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు ఒక ఆర్‌ఎంపీ సాయంతో జిల్లా కేంద్రంలోని రామలింగేశ్వర థియేటర్‌ సమీపంలో పేరులేని ఓ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ అబార్షన్‌ కోసం ప్రయత్నించగా ఆమె పరిస్థితి విషమించడంతో ఖమ్మం తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందింది. జిల్లాలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.

హడావుడి చేశారు.. వదిలేశారు!

మూడు నెలల క్రితం జిల్లా కేంద్రంలో అనుమతులు లేని ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లు, అర్హత లేని వైద్యులపై తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ బృందంతో పాటు వైద్యారోగ్యశాఖ నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించింది. కొందరు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేయగా అనుమతులు లేని రెండు మూడు ఆస్పత్రులను, స్కానింగ్‌ సెంటర్లను సీజ్‌ చేశారు. అప్పటి వరకే హడావుడి చేసిన వైద్యారోగ్య శాఖ మళ్లీ తనిఖీలకు వెళ్లకపోవడంతో లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఫ రూ.పదివేలిస్తే పరీక్ష.. క్షణాల్లో రిపోర్టు

ఫ ఆడపిల్ల అయితే అబార్షన్లు సైతం చేయిస్తున్న వైనం

ఫ శుక్రవారం సూర్యాపేటలో పరీక్షలు చేస్తున్న వారి గుట్టు రట్టు

యథేచ్ఛగా లింగ నిర్ధారణ! 1
1/2

యథేచ్ఛగా లింగ నిర్ధారణ!

యథేచ్ఛగా లింగ నిర్ధారణ! 2
2/2

యథేచ్ఛగా లింగ నిర్ధారణ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement