
జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచందర్‌ను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించింది.
ఏటీసీ, ఐటీఐలో
ప్రవేశాలకు దరఖాస్తులు
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ), ఐటీఐ కోర్సుల్లో రెండవ విడత ప్రవేశాలకు పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఐటీఐ కళాశాలల కన్వీనర్ జింజిరాల వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ : 8919234137 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
నడిగూడెం : రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి(డీఎస్‌ఓ) వి.మోహన్‌బాబు అన్నారు. శుక్రవారం నడిగూడెంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 32 వేల రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ మీ సేవ కేంద్రంలో ఆన్‌లైన్ చేయించి దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఏపూరి తిరుపమ్మ, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ వి.సరిత, డీటీసీఎస్ రామిరెడ్డి, ఆర్‌ఐలు గోపాలకృష్ణ, రాంబాబు పాల్గొన్నారు.
సమస్యలపై పోరాడాలి
సూర్యాపేట అర్బన్ : దళితుల సమస్యలపై పోరాడేందుకు వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో గ్రామగ్రామాన క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని స్టార్ బాంకెట్ హాల్‌లో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్కైలాబ్ బాబు మాట్లాడారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో దళిత గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కోట గోపి, నాయకులు నందిపాటి మనోహర్, ప్రకాష్, కరత్, మంద సంపత్, దుర్గం, దినకల్, శేఖర్, యాదగిరి, రమణ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బందిపై
బదిలీ వేటు
పెన్‌పహాడ్ : పెన్‌పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మండల వైద్యాధికారితో పాటు సూపర్‌వైజర్‌లపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ బదిలీ వేటు వేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కోటిరత్నం తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పెన్‌పహాడ్‌లో ఆమె మాట్లాడుతూ మండల వైద్యాధికారి స్రవంతి, ఏఎన్‌ఎంలు విధుల విషయంలో గొడవ పడి ఒకరిపై మరొకరు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపి నివేదికను అందజేసినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా పర్యవేక్షణ లోపం కారణంతో వైద్యాధికారి స్రవంతి, హెచ్‌ఈఓలు చంద్రశేఖరరాజు, శ్రీనివాసులు, సూపర్‌వైజర్‌లు జానకమ్మ, సైదయ్యపై బదిలీ వేటు వేసినట్లు పేర్కొన్నారు. మోతె మండలంలో విధులు నిర్వర్తిస్తున్న రాజేష్‌ను డిప్యుటేషన్‌పై మండల వైద్యాధికారిగా నియమించినట్లు ఆమె తెలిపారు.

జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్

జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్