
ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా అమలుకు కేంద్రం కుట్ర
సూర్యాపేట అర్బన్ : దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సూర్యాపేట పట్టణంలో కొనసాగుతున్న కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులకు గురువారం తమ్మినేని హాజరై మాట్లాడారు. దళితులు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేయడం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. దళితులు, బలహీన వర్గాలు ప్రతిఘటన పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బిహార్‌లో ఓటర్ల ప్రక్షాళన పేరుతో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లను తొలగిస్తోందన్నారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఓటర్ల సవరణ పేరుతో ఆధార్ కార్డులను నిరాకరించి పౌరసత్వాన్ని నిరూపించుకునే ఆధారాలు ఉన్నా పట్టించుకోకుండా కుట్రలు చేసి అర్హులైన ఓట్లను తొలగిస్తోందన్నారు. తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపినా పట్టించుకోవట్లేదన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేమని పరోక్షంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రమాదం తీవ్రంగా పెరుగుతోందని ప్రజల విషయాలను మతపరంగా చూస్తూ మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తోందన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు, జిల్లా కార్యదర్శి కోట గోపి, పాలడుగు నాగార్జున, నందిపాటి మనోహర్, తిప్పారపు సురేష్, మంద సంపత్, బొట్ల శేఖర్, దుర్గం దినకర్, ప్రకాష్, శరత్, జిల్లా అధ్యక్షుడు మరి నాగేశ్వరరావు, సుధాకర్, పిండిగ నాగమణి, సైదులు, యాదగిరి, దుర్గారావు, వెంకటరమణ, రమణ, సురేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తమ్మినేని వీరభద్రం