
అందుబాటులో 10వేల టన్నుల యూరియా
భానుపురి (సూర్యాపేట) : ‘జిల్లాలో పదివేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది.. ఇతర ఎరువులు కావాల్సినన్ని ఉన్నాయి.. రైతులు ఎవరూ అధైర్య పడవద్దు’ అని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నకిలీ విత్తనాలు అరికట్టడంతో పాటు విత్తనాల నాణ్యత పరిశీలించడంలో వ్యవసాయ అధికారులు బాగా పని చేశారని అభినందించారు. రైతు భరోసా ద్వారా రైతులకు ముందస్తుగా పెట్టుబడి అందించామన్నారు. అధికారులు రైతు వేదికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు సూచనలు చేయాలన్నారు. ఎరువుల దుకాణాలను తనిఖీలు చేయాలన్నారు. యూరియా ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువుల కొరత ఏర్పడితే కంట్రోల్ రూమ్ నంబర్ 8977741771 కి కాల్ చేసి తమ సమస్యను తెలియజేయాలన్నారు. పంట రుణాల కోసం బ్యాంకుల్లో ఏమైనా సమస్యలు ఏర్పడితే అధికారులు పరిష్కరించాలన్నారు. వన మహోత్సవంలో వ్యవసాయ శాఖ కి ఇచ్చిన 3 లక్షల లక్ష్యాన్ని అధిగమించేలా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం ఉద్యాన దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఉద్యాన వన అధికారి నాగయ్య, ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు, అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ఫ వ్యవసాయ, ఉద్యాన
అధికారులతో సమీక్ష
ఫ ఎరువుల కొరత ఏర్పడితే కంట్రోల్ రూమ్ నంబర్ 8977741771 కి ఫోన్ చేయండి