
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా అన్ని మండలాల్లోని పోలీస్ అధికారులు అప్రమత్తంగాఉండాలని, అవసరమైన చోట హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్లతో జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహం వద్ద సెల్ఫీలు దిగొద్దని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీస్ సాయం పొందవచ్చని కోరారు.
ప్రభుత్వ విద్యారంగ
పరిరక్షణే లక్ష్యం
కోదాడరూరల్ : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే టీఎస్ యూటీఎఫ్ లక్ష్యమని ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు ఎన్.నాగేశ్వరరావు, పాండురంగాచారి పేర్కొన్నారు. గురువారం కోదాడ మండల పరిధిలోని దోరకుంట, చిమిర్యాల, నల్లబండగూడెం, మంగలితండా పాఠశాలల్లో టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో తమ సంఘం ముందుటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు మైసయ్య, శ్రీనివాసరావు, నరసింహారావు, హనుమంతరావు పాల్గొన్నారు.
ఇద్దరు మున్సిపల్
ఉద్యోగుల సస్పెన్షన్
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం సస్పెన్షన్ వేటు వేశారు. నల్లా బిల్లు వసూలుకు సంబంధించిన రశీదు పుస్తకం కనిపించకుండా విధుల్లో అలసత్వం వహించినందుకు సీనియర్ అసిస్టెంట్ బూర సతీష్, నల్లా బిల్లులు వసూలు చేసిన తప్పుడు లెక్క చేసి రూ. 4400 తక్కువగా మున్సిపాలిటీలో జమచేసినందుకు రెగ్యులర్ వాటర్ సప్లయ్ ఉద్యోగి సౌడం సురేష్‌లను సస్పెండ్ చేశారు. బిల్లుల వసూలు, జమను పరిశీలించడంలో అశ్రద్ధ వహించిన రెవెన్యూ అధికారి టి.కళ్యాణి కి మెమో జారీ చేశారు.