
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండలం వంకమామిడి శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన రాధారపు మల్లేశ్, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మానస(20) డిగ్రీ పూర్తి చేసి భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో 20 రోజుల క్రితం చేరి కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటోంది. ప్రతిరోజు ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో పోచంపల్లికి వచ్చి వెళ్తోంది. బుధవారం గ్రామానికి వచ్చే బస్సు రాకపోవడంతో భూదాన్‌పోచంపల్లిలో బైక్ మెకానిక్ పని నేర్చుకుంటున్న తన పెద్దనాన్న కుమారుడు రాధారపు బాలకృష్ణ బైక్‌పై వచ్చింది. తిరిగి రాత్రి ఇంటికి అతడి బైక్ పైనే వెళ్తుండగా.. వంకమామిడి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ పక్క నుంచి నెమ్మదిగా వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పడంతో మానస ఒక్కసారిగా వెనుకకు ఒరగగా, ఆమె తల టిప్పర్‌కు బలంగా తాకడంతో తల పగిలి అక్కడక్కడే మృతిచెందింది. బాలకృష్ణ బైక్ పైనుంచి కిందపడిపోగా.. అతడి కాలు, చెయ్యి విరిగింది. గాయపడిన బాలకృష్ణ వెంటనే ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పాడు. బాలకృష్ణను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మానస మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. కాగా గురువారం ఇరుపక్షాల పెద్దమనుషులు కూర్చొని మృతురాలి కుటుంబానికి టిప్పర్‌పై ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులతో పాటు రూ.1.65లక్షల పరిహారం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు.