
యాదగిరి మాడ వీధిలో ప్రసాద టిక్కెట్ కౌంటర్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడ వీధిలోని అఖండ దీపారధన పక్కన నూతనంగా ప్రసాద టిక్కెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.15లక్షలతో 6 టిక్కెట్ కౌంటర్లను 70 గజాల్లో నిర్మాణం చేశారు. ప్రత్యేక గదులు, షెడ్డు, భక్తులు టిక్కెట్ కొనుగోలు చేసేందుకు వీలుగా గ్రిల్స్ సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శివాలయానికి వెళ్లే మెట్ల దారిలో లడ్డూ, పులిహోర ప్రసాద టిక్కెట్ కౌంటర్లను గతంలో ఏర్పాటు చేశారు. భక్తులు మెట్ల మార్గంలో వెళ్లి టిక్కెట్ కొనుగోలు చేసి, తిరిగి మెట్లు ఎక్కి ప్రసాద విక్రయ కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని భక్తులు స్వామిని దర్శించుకొని నేరుగా అఖండఽ దీపారాధన పక్కన ఏర్పాటు చేసిన టిక్కెట్ కౌంటర్‌లో లడ్డూ, పులిహోర టిక్కెట్లు కొనుగోలు చేసి అక్కడి నుంచి ప్రసాద విక్రయశాలకు వెళ్లెందుకు వీలు కల్పించారు. ప్రసాదం కొనుగోలు చేసిన భక్తులు పక్కనే ఉన్న శివాలయానికి వెళ్లి, అక్కడి నుంచి బస్టాండ్‌కు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద టిక్కెట్ కౌంటర్‌ను శ్రావణమాసం మొదటి రోజు శుక్రవారం ప్రారంభించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.