
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మద్దిరాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం కుక్కడం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజగానితండాకు చెందిన లాకవత్ రవీందర్ బతుకుదెరువు కొరకు హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టడతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హైదరాబాద్‌లోనే ఓ హాస్పిటల్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
మనస్తాపంతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
చింతపల్లి: భూ వివాదంలో అవతలి వ్యక్తులు అనే మాటలకు మనస్తాపం చెందిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చింతపల్లి మండలం వింజమూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దవారిగూడెంలో సోమవారం జరిగింది. చింతపల్లి ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. బద్దవారిగూడెం గ్రామానికి చెందిన కడారి చంద్రయ్య(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా చంద్రయ్య కుటుంబానికి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి మధ్య పొలం పంచాయితీ జరుగుతుండగా.. ఆ వ్యక్తి అనే మాటలకు మనస్తాపం చెందిన చంద్రయ్య సోమవారం తన వ్యవసాయ పొలం వద్ద వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
పాముకాటుతో
గొర్రెల కాపరి మృతి
నడిగూడెం: పాముకాటుకు గురై గొర్రెల కాపరి మృతిచెందాడు. ఈ ఘటన నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ జి. అజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా ఇడ్లీరు గ్రామానికి చెందిన సిద్ద నగేష్ (28) గొర్రెలను మేపుకుంటూ నడిగూడెం మండలానికి వలస వచ్చాడు. గత రెండు రోజులుగా నడిగూడెం మండలం రత్నవరం గ్రామ సమీపంలో శ్రీరంగాపురం గ్రామానికి చెందిన శేషగుప్తా వ్యవసాయ క్షేత్రంలో పెంట కోసం గొర్రెలను ఉంచాడు. సోమవారం తెల్లవారుజామున గొర్రెల వద్ద నిద్రిస్తున్న నగేష్‌ను పాము కాటు వేసింది. అతడిని కోదాడకు తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.