
ఉచితాలతో ఆరి్థక వ్యవస్థ చిన్నాభిన్నం
నల్లగొండ: ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పనిచేసే కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదన్నారు. ప్రజలు ఉచితాల పథకాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. దేశంలో వ్యవసాయమే ప్రధానమైందని, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పని వైపు ప్రజలను మళ్లించి ఉచితాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల్లో విచ్చలవిడి ఖర్చే అవినీతికి మూలం
దేశంలో అవినీతి పేరుకుపోయిందనే వాదన ఉంది. ఎన్నికల్లో విచ్చలవిడిగా పార్టీలు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నాయి. ఆ తర్వాత ఖర్చు పెట్టిన డబ్బును సంపాదించడానికి అవినీతికి పాల్పడుతున్నారు. దీనిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ చొరవచూపాలి. రాజకీయ నాయకులే కాదు.. కొందరు అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. ఇంజనీరింగ్ శాఖలో ఇష్టమొచ్చినట్లు ఎస్టిమేట్ వేసి అక్రమాలకు పాల్పడుతున్నారు.
నాయకుల భాష మారాలి
రాజకీయ నాయకులు మాట్లాడే భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వారు వాడే భాషతో భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారనేది ఆలోచించాలి. రాజకీయ నాయకులంటే ఇప్పటికే ప్రజలు ఈసడించుకుంటున్నారు. రాజకీయ నాయకులు గౌరవంగా మాట్లాడాలి. బనకచర్లను ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ఒప్పందం ప్రకారమే చేసుకోవాలి. ఎమ్మెల్సీలు మల్లన్న, కవిత ఫిర్యాదులపై రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారన్నారు. పెద్దల సభను గౌరవించాల్సిన అవసరం అందరికి ఉంది. దూషణలు, దాడులు సరికావన్నారు. సాగర్ ఎడమ కాల్వకు ముందే నీటి విడుదల చేయడం వల్ల రైతులు ఆనందంగా ఉన్నారన్నారు.
పనిచేసే కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు
అధికార, ప్రతిపక్షాలు వాడే భాష మార్చుకోవాలి
శాసనమండలి చైర్మన్
గుత్తా సుఖేందర్‌రెడ్డి