చందంపేట: వారంతా అమాయక కూలీలు.. కూలీ నాలి చేసుకుంటూ రోజు గడిపే వారు. వారికి పనులు కల్పిస్తామంటూ కొందరు మాయమాటలతో నమ్మించి.. వారి శ్రమను వాడుకుంటూ.. వేతనాలు ఇవ్వడం లేదు. తిరిగి సొంతూరికి కూడా వెళ్లన్వికుండా దాడులు చేస్తూ.. కనీసం వారి కుటుంబీకులతో ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వ లేదు. గత రెండేళ్లుగా సాగుతున్న ఈ శ్రమదోపిడీ దందా గుట్టును రట్టు చేశారు పోలీసులు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో స్పెషల్ కార్డన్ సెర్చ్ చేపట్టగా శ్రమ దోపిడీతో రెండేళ్లుగా నరకం అనుభవిస్తున్న వలస కార్మికులకు విముక్తి లభించింది. అయితే కొందరికి మాత్రమే విముక్తి లభించగా.. మరికొందరి కోసం పోలీసుల విచారణ కొనసాగుతోంది.
రెండేళ్లుగా గుట్టుగా..
నేరేడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీలో చేపల వేట నిర్వహిస్తున్న పలువురు మత్స్యకారులు ఈ ప్రాంతంలో పనులు చేసేందుకు గాను ఒడిషా, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చిన వారిని సాగర్ బ్యాక్ వాటర్ సమీపంలోని ఓ అటవీ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసి వారితో పనులు చేయించుకుంటున్నారు. చేపలు పట్టేందుకు వీరితో పనులు చేయించుకుంటూ వారికి వేతనం ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. కేవలం అన్నం మాత్రమే పెట్టి వెట్టి చేయించుకున్నారు. రెండేళ్లుగా ఇలా వారు నరకయాతన అనుభవిస్తున్నారు.
తిరిగి వెళ్లనివ్వకుండా..
వైజాగ్‌కాలనీలో పనిచేసే వలస కార్మికులు తిరిగి వారి సొంత ప్రాంతానికి వెళ్లే మార్గం చూపించకుండా.. సాగర్ వెనుక జలాల్లో అటవీ ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసి వారిని అక్కడే ఉంచి వెట్టి చాకిరి చేయిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్‌లో మాట్లాడనివ్వకుండా బలవంతంగా పనులు చేయించి హింసించారు. డబ్బులు అడిగితే వారిపై దాడులకు పాల్పడ్డారు.
పోలీసుల దాడులతో
బట్టబయలు
వలస కార్మికుల వెట్టి చాకిరీ విషయం దేవరకొండ పోలీసుల దృష్టికి రావడంతో ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో ఆది, సోమవారం ఆ ప్రాంతాలను గుర్తించి, 30 మంది వలస కార్మికులను దేవరకొండకు తరలించారు. వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా వంద మంది వరకు కూలీలు వచ్చినట్లు సమాచారం ఉండడం.. కొంత మంది మాత్రమే దొరకడంతో మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
ఓ కార్మికుడి అంత్యక్రియలూ ఇక్కడే..
నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన కార్మికుడు తన స్వగ్రామానికి వెళ్తానని తనను ఇక్కడికి తీసుకొచ్చిన వారిని అడిగాడు. వారికి తెలియకుండా తన స్వగ్రామానికి వెళ్లే ప్రయత్నంలో పెద్దమునిగల్ గ్రామ అటవీ ప్రాంతంలో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. అతని మృతదేహాన్ని కనీసం స్వగ్రామానికి కూడా పంపకుండా.. వైజాగ్ కాలనీలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
ఫ సాగర్ బ్యాక్ వాటర్ అటవీ ప్రాంతంలోని స్థావరంలో బందీలుగా ఇతర రాష్ట్రాల కార్మికులు
ఫ వారి చేత చేపలు పట్టే పనులు చేయిస్తూ.. వేతనాలు ఇవ్వని వైనం
ఫ సొంతూరికి వెళ్లలేక.. వేతనాలు లేక చితికిపోయిన కార్మికులు
ఫ పోలీసుల తనిఖీతో బయటపడ్డ కార్మికులు