
కొండగడప విద్యార్థినికి ప్రశంసలు
మోత్కూరు: మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని దొండ స్వాతి ప్రముఖ సాహితీవేత్తల నుంచి ప్రశంసలు అందుకుంది. స్వాతి విద్యార్థి దశనుంచే రచనలు, వ్యాసాలు రాస్తూ పేరుగడించారు. ఆమె రాసిన వ్యాసం చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ సూర్య ధనుంజయ్, సాహితీవేత్త ముదిగొండ శివప్రసాద్, నలిమిల భాస్కర్, ఆట్టం దత్తయ్య వ్యాసాల సరసన చోటు దక్కడంతో ఆమెకు సత్కరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు స్వాతిని సన్మానించారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఆలేరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ జయరాజారామ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లిష్, తెలుగు, డెయిరీ సైన్స్ సబ్జెక్టులకు గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. పీజీలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50శాతం, ఇతరులు 55శాతం మార్కులు ఉండాలన్నారు. పీహెచ్‌డీ, నెట్, సెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 3గంటల వరకు దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని సూచించారు.