సూర్యాపేట : బతుకు పోరాటం చేస్తున్న రైతులపై యుద్ధం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రైతాంగానికి క్షమాపణ చెప్పి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా గోదావరి జలాలు అందించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్పు పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకుందన్నారు. రైతాంగానికి నీళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు లేదన్నారు. వారిద్దరికీ నీటి పారుదల రంగంపై పరిజ్ఞానం లేదన్నారు. ఉత్త మాటలో చెత్త మాటలో చెప్పడం లేదని, తన మాటలు అబద్ధమని నిరూపిస్తే ఏ శిక్షకై నా సిద్ధమని సవాల్ విసిరారు. ఇప్పటికై నా ప్రభుత్వం చేసిన తప్పును ఒప్పుకొని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీరు అందించాలన్నారు. దీంతో మిడ్ మానేరు, మల్లన్న సాగర్ ద్వారా బస్వాపూర్, గంధమల్ల, ఎస్సారెస్పీ ద్వారా ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సమృద్ధిగా నీరు అందుతదన్నారు. కన్నెపల్లిలో బటన్ నొక్కితో నాలుగు రోజుల్లో పెన్‌పహాడ్ మండలం రావి చెరువుకు నీళ్లు అందే అవకాశం ఉందన్నారు. చంద్రబాబుకు బనకచర్ల అనుమతులు రావడం కోసమే కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన సోలిపేట, రత్నపురం, రామారం, యర్కారం గ్రామాల్లో కూడా సైతం గోదావరి జలాలతోనే పంటలు పండాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఫ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి