
వ్యవసాయ కళాశాలకు భూమి కావాలి
ఎకరాకు రూ.20 లక్షలు
కోదాడ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ లేదా అసైన్డ్ భూమి వంద ఎకరాలు లభ్యమైతే అక్కడ వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇచ్చారు. నీటి వసతితో పాటు రవాణా సౌకర్యాలుంటే సదరు భూమి ఎకరాకు రూ.20 లక్షల వరకు పరిహారం ఇప్పిస్తామని ఆయన వారికి పంపిన సమాచారంలో పేర్కొన్నారు. కానీ కోదాడ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎకరా భూమి రూ.30 లక్షలకు పైగా ఉందని అంతకంటే తక్కువ రేటు చెల్లిస్తే భూమి లభ్యం కావడం కష్టమని అంటున్నారు. సర్వే నంబర్ 190 ప్రభుత్వ భూమి కావాల్సినంత ఉన్నందున అసైన్డ్ భూములకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చి భూములను తీసుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు.
కోదాడ: మూడు నెలల క్రితం ఉగాది పండుగ రోజు హుజూర్‌నగర్ నియోజకవర్గానికి వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అప్పటి నుంచి కళాశాల ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికి అది ముందుకు సాగడం లేదు. కళాశాల ఏర్పాటుకు నీటి సౌకర్యంతో పాటు సాగుకు యోగ్యంగా ఉన్న 100 ఎకరాల భూమి అవసరమవుతుంది. గడిచిన మూడు నెలలుగా అధికారులు హుజూర్‌నగర్ నియోజవకవర్గంలో భూమి కోసం జల్లెడ పడుతున్నారు. కానీ ఎక్కడా అనువైన వంద ఎకరాల భూమి లభ్యం కాలేదు. దీంతో ఈ కళాశాల ఏర్పాటుకు కోదాడ నియోజకవర్గాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ భావించి వంద ఎకరాల ప్రభుత్వ లేదా ప్రైవేట్ భూమి అందుబాటులో ఉంటే వెంటనే రెవెన్యూ అధికారులకు చెప్పాలని రెండు రోజుల క్రితం కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక నాయకులు భూమి ఎక్కడ ఉందోనని ఆరా తీయడం మొదలు పెట్టారు
సర్వే నంబర్ 190లో
2వేల ఎకరాల ప్రభుత్వ భూమి
కోదాడ నియోజకవర్గంలోని మునగాల, నడిగూడెం మండలాల్లోని ముకుందాపురం, ఆకుపాముల, కోదండరామాపురం, తెల్లబెల్లి, ఎక్లాస్‌గాని పేట, రామాపురం గ్రామల పరిధిలో సర్వే నంబర్ 190లో దాదాపు 2వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని పలువురు ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. కొందరికి ప్రభుత్వం పట్టాలను కూడి ఇచ్చింది. ఈ సర్వే నంబర్ విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో రవాణా సౌకర్యానికి ఇబ్బంది ఉండదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు వంద ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి సులువుగా లభ్యం అవుతుందని, దీనికి సమీపంలోనే సాగర్ ఎడమ కాలువు వెళుతుండడంతో పాటు ఇప్పటికే ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి వసతి ఉన్నందున ఇక్కడ కళాశాల ఏర్పాటును మంత్రి పరిశీలించాలని పలువురు కోరుతున్నారు.
ఫ వంద ఎకరాల భూమి ఉంటే చెప్పండి
ఫ కోదాడ నాయకులను
కోరిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ మునగాల, నడిగూడెం మండలాల
పరిధిలోని భూములను
పరిశీలించాలంటున్న విద్యావేత్తలు
ఫ నేషనల్ హైవే సమీపంలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి !