భానుపురి (సూర్యాపేట) : వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించేందుకు నిర్వహించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే ఈ అవార్డులకు ధైర్యం, కళలు, సంస్కృతి, శాస్త్ర సాంకేతికత, క్రీడలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ అనే ఆరు అంశాల్లో ప్రతిభ గల విద్యార్థులు htt p://awards.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిభ గల బాలికలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
‘నవోదయ’లో
వసతులు కల్పించాలి
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న జవహర్ నవోదయ విద్యాలయంలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ సూచించారు. సూర్యాపేట పట్టణంలోని రెడ్డి హాస్టల్‌లో ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ విద్యాలయంలో బెంచీలు, ఆర్వో ప్లాంట్, వంట గది, వంట సామగ్రి, డైనింగ్ హాల్స్, టాయిలెట్లు, లైబ్రరీ కోసం టేబుళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుంచి జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యాలయంలో త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, డీఈఓ అశోక్, తహసీల్దార్ కృష్ణయ్య, జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్, తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డీఈ రమేష్, ఏఈ ఓబుల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎనిమిది మంది
ఎస్‌ఐల బదిలీ
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మంది ఎస్‌ఐలను ఎస్పీ కె.నరసింహ బదిలీ చేశారు. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్(వేకెన్సీ రిజర్వు)లో ఉన్న ఎ.శివరాజ్‌ను సూర్యాపేట టౌన్ –2కు, సూర్యాపేట టౌన్– 2లో పని చేస్తున్న ఎం.ఆంజనేయులను వీఆర్‌లో ఉంచారు. వీఆర్‌లో ఉన్న సీహెచ్.గోపాల్‌రెడ్డి(ప్రొబేషనరీ ఎస్‌ఐ)ని కోదాడ రూరల్ స్టేషన్‌కు, కోదాడ రూరల్ స్టేషన్‌లో పని చేస్తున్న ఎం.అనిల్‌రెడ్డిని వీఆర్‌లో ఉంచారు. వీఆర్‌లో ఉన్న వి.సురేష్‌రెడ్డి(ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్)ని చిలుకూరు పోలీస్ స్టేషన్‌కు, చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్.రాంబాబును వేకెన్సీ రిజర్వులో ఉంచారు. వీఆర్ లో ఉన్న టి.అజయ్‌కుమార్(ప్రొబేషనరీ ఎస్‌ఐ)ను మోతె పోలీస్ స్టేషన్‌కు, మోతె పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న బి.యాదవేందర్‌రెడ్డిని వీఆర్‌లో ఉంచారు.