
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
గరిడేపల్లి: భూ సమస్యలు పరిష్కరించే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. గరిడేపల్లి మండలం రాయినిగూడెం, తాళ్లమల్కాపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా గరిడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. గ్రామాల్లో రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి విచారణ జరిపి నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. గ్రామసభలు నిర్వహించిన సమయంలో రైతులు పాల్గొని తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అధికారులకు ఇవ్వాలని సూచించారు. రైతులు దరఖాస్తులు నింపే విషయంలో ఇబ్బందులు లేకుండా గ్రామసభలు నిర్వహించే చోట సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో సమస్యల పరిష్కారానికి ప్రజలు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సివచ్చేదన్నారు. ఇప్పుడు అధికారులు స్వయంగా గ్రామాలకు వచ్చి ప్రజల సమస్యలను స్వీకరిస్తున్నామని తెలిపారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారని తద్వారా వారికి ఉత్తర్వులు జారీ చేస్తారని వివరించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే గ్రామాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ సదస్సు ద్వారా రాయినిగూడెంలో 140 దరఖాస్తులు, తాళ్లమల్కాపురంలో 73దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్, కోదాడ ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, డీఏఓ రాజేందర్‌రెడ్డి, తహసీల్దార్ బండ కవిత, నడిగూడెం, కోదాడ, తహసీల్దార్లు సరిత, వాజిద్‌అలీ, ఆర్‌ఐలు ప్రవీణ్, రాంబాబు, దబ్రేజ్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
భానుపురి (సూర్యాపేట) : వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరెట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ తాగు నీటిని సరఫరా చేయాలన్నారు. జిల్లా వెబ్ పోర్టల్‌లో శాఖల వారీగా ప్రొఫైల్, జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు సిబ్బంది వివరాలు, జాబ్ చార్ట్, వార్షిక నివేదిక, శాఖల వారీగా అమలు చేసిన పథకాల లబ్ధిదారులు వివరాలు అప్డేట్ చేయాలన్నారు. రాష్ట్ర , జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. దీనిపై అర్జీదారులకు కచ్చితమైన సమాధానం తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ వివి అప్పారావు, డీపీఓ యాదగిరి, డీడబ్ల్యూ ఓ నరసింహారావు, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, డీఎంహెచ్‌ఓ కోటాచలం, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమశాఖల అధికారులు శంకర్, దయానంద రాణి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, పరిపాలన ధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయిగౌడ్, శ్రీనివాస రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం