‘కెమికల్‌ పార్కునకు భూములు ఇవ్వం’ | - | Sakshi
Sakshi News home page

‘కెమికల్‌ పార్కునకు భూములు ఇవ్వం’

Sep 16 2026 4:19 AM | Updated on Sep 16 2026 4:19 AM

సంతబొమ్మాళి: రైతులు, మత్స్యకారుల జీవితాలను దెబ్బతీసే కెమికల్‌ పార్కు ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని వడ్డితాండ్ర గ్రామ రైతులు, మత్స్యకారులు తేల్చిచెప్పారు. మంగళవారం వడ్డితాండ్రలో కెమికల్‌ పార్కు పై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ అభ్యంతరాలను, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాతలు, తండ్రుల కాలం నుంచి తమ కుటుంబాలకు ఆధారంగా ఉన్న భూములను పరిశ్రమల కోసం కోల్పోయి, వారు ఇచ్చే పరిహారంతో తాము ఎక్కడా భూమి కొనుగోలు చేయలేమని రైతులు అవేదన వ్యక్తం చేశారు. భూమి ఉంటేనే మాకు భరోసా.. డబ్బులు మాకు వద్దు అంటూ స్పష్టం చేశారు. తమ భూములకు విలువ లేదని అధికారులు చెబుతున్నప్పుడు పరిశ్రమలను మాత్రం ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. తాగునీటి సమస్యను పరిష్కరించలేని పరిస్థితుల్లో పరిశ్రమలు తమకు అవసరం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. సుమారు 4వేల కుటుంబాలు తంపరపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. తంపరలో కొందరు వ్యక్తులు అక్రమణలకు పాల్పడుతున్నారని, ఆ భూములను ఎవరు ఇచ్చారు? ఏ విధంగా ఇచ్చారో తేల్చిచెప్పాలని డిమాండ్‌ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ మాట్లాడుతూ కెమికల్‌ పార్కు ఏర్పాటుకు సుమారు 3వేల ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. ఈ పార్కులో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుపై ఉన్న అపోహలను వీడి, పార్కు స్థాపనకు అందరూ సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement