● భక్తిశ్రద్ధలతో బక్రీద్
జిల్లా కేంద్రంలోని జామియా మసీదులో ముస్లింలు గురువారం బక్రీద్‌ను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మత పెద్ద ఇమాం వహాబ్ ఆధ్వర్యంలో నమాజు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు –శ్రీకాకుళం కల్చరల్
● అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ ఇచ్చిన నాగార్జున
నందిగాం: నందిగాంకు చెందిన బంగారు నాగార్జున (38) బ్రెయిన్ డెడ్‌తో మృతి చెంది మరో ఐదుగురికి అవయవ దానంతో ప్రాణం పోశారు. వివరాలను పరిశీలిస్తే.. నందిగాంకు చెందిన నాగార్జున మైక్ సెట్లు, లైటింగ్, డీజేలు అద్దెకు ఇస్తూ జీవనం సాగించేవాడు. మూడు రోజుల క్రితం పనిచేస్తూ ఒక్కసారిగా పడిపోవడంతో తోటివారు స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యు డు పరిశీలించి పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాగోలు జెమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వివిధ పరీక్షలు చేసిన వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా గుర్తించారు. దీంతో జీవన్‌దాన్ వారు నాగార్జున కుటుంబ సభ్యులకు అవయవ దానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో నాగార్జున నుంచి లివర్, రెండు కిడ్నీలు, రెండు ఊపిరితిత్తులు, కార్నియా సేకరించి ఊపిరితిత్తులను హైదరాబాద్, ఒక కిడ్నీ విశాఖపట్నం, మరో కిడ్నీ, లివర్, కార్ని యాని శ్రీకాకుళం తరలించి మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు.
అంతటి శోకంలోనూ అవయవదానంకు అంగీకరించిన నాగార్జున తల్లిదండ్రులు తులసయ్య, బోడెమ్మ, భార్య దివ్య, తమ్ముడు చంటిను పలువురు కొనియాడారు.
మృతుడికి ఆరో తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. అయితే నిత్యం మైక్‌సెట్, డీజేలతో సందడిగా ఉండే నాగార్జున మృతిలో నందిగాంలో తీవ్ర విషాదం నెలకొంది.


