సీఎం చంద్రబాబు జిల్లాకు చేసిన మేలేంటి..? | - | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు జిల్లాకు చేసిన మేలేంటి..?

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు జిల్లాకు చేసిన మేలేంటని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పి.తేజేశ్వరరావులు ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో అచ్చెన్నాయుడు చేస్తున్న అభివృద్ధి ఎరజ్రెండా ఉద్యమాలను అడ్డుకోవడమేనా అని ప్రశ్నించారు. ఎరజ్రెండా ఎల్లప్పుడూ శ్రమజీవుల పక్షాన ఉంటుందని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా విధ్వంసకర ప్రాజెక్టులతో జిల్లాని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సముద్ర తీర ప్రాంతమంతా రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కోసమే అప్పజెప్పడం ద్వారా సముద్ర తీరం తవ్వకాలకు గురై పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్నారు. పంట భూములు ఉప్పునీటి భూములుగా మారిపోయి వ్యవసాయం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం విస్మరించి వేలాది మంది మత్స్యకారులను వేటకు దూరం చేయడం సరికాదన్నారు. కార్గో ఎయిర్‌పోర్టు పేరుతో లక్షలాది చెట్లను నరికి ఉద్దానాన్ని ఎందుకు విధ్వంసాన్ని చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించకుండా అభివృద్ధి కోసం మాట్లాడుతారా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా జిల్లాకు మేలుచేసే పనులు చేపట్టాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement