కోరలు చాచిన కిడ్నీవ్యాధి..! | - | Sakshi
Sakshi News home page

కోరలు చాచిన కిడ్నీవ్యాధి..!

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

ఇజ్జాడపాలెంలో మరణ మృదంగం

ఇజ్జాడపాలెంలో మరణ మృదంగం

ఇప్పటికే 10 మందికి పైగా మృతి

అంతుపట్టని కారణాలు

నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్న గ్రామస్తులు

రణస్థలం:

హ్లాదకరమైన వాతావరణం.. చుట్టూ పచ్చని పైరు.. కొబ్బరి చెట్ల మధ్యలో అందమైన గ్రామం లావేరు మండలంలోని ఇజ్జాడపాలెం. అయితే అటువంటి గ్రామానికి పదేళ్లుగా కిడ్నీ మహమ్మారి పట్టిపీడిస్తోంది. సుమారు 1,200 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో గత పదేళ్లలో 10 మందికి పైగా కిడ్నీ వ్యాధితో చనిపోవడంతో గ్రామస్తుల్లో భయందోళనలు నెలకొన్నాయి. ఈ మహమ్మారి ఇజ్జాడపాలెంతో పాటు చుట్టుపక్కల గోవిందపురం, లుకలాపుపేట తదితర గ్రామాలకు ఇప్పుడిప్పుడే వ్యాపించడంతో అక్కడ సైతం కేసులు బయటపడుతున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితికి తాగునీరే కారణమా.. లేక మరే ఇతర అవశేషాలు ఉన్నాయో గ్రామస్తులకు అంతుబట్టడం లేదు. ఇటీవల గ్రామంలోని వాటర్‌ శాంపిల్స్‌ను వైద్యాధికారులు తీసుకొని వెళ్లారు. అయితే ఆ నమూనాలో ఎటువంటి ఫలితం కనిపించలేదు. అందువలన అధికారులు చొరవ తీసుకొని కారణాలను విశ్లేషించాలని స్థానికులు కోరుతున్నారు.

మోగుతున్న ప్రమాద ఘంటికలు

ఇజ్జాడపాలెం గ్రామంలో గత పదేళ్లలో పదిమంది కిడ్నీ మహమ్మారికి బలైపోయారు. వారిలో ఇజ్జాడ అప్పలనాయుడు (మాజీ సర్పంచ్‌), ఇజ్జాడ సూర్యనారాయణ, పిసిని అప్పలనాయుడు, పతివాడ రమణ, కందివలస అప్పారావు, కందివలస కాంతమ్మ, గొర్లె లక్ష్మి, గొర్లె త్రినాథ్‌, వండాన ఆదినారాయణ తదితరులు ఉన్నారు. కాగా మరో ఐదుగురు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా మంగళవారం గొర్లె త్రినాథ్‌ (48) మృతి చెందాడు. దీంతో ఈ గ్రామంలో నివాసం ఉండాలంటేనే ప్రజలు బయపడిపోతున్నారు.

తీరని వెతలు

ఇజ్జాడపాలెంలో కుటుంబాలన్నీ వ్యవసాయంపై అధారపడినవే. కిడ్నీవ్యాధి బారిన పడుతున్న ఆయా కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. కిడ్నీ వ్యాధి సోకినప్పటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి ఆస్పత్రులకు తిరుగుతూ లక్షల్లో ఖర్చులు పెడుతున్నా ఫలితం కనిపించడం లేదు. డయాలసిస్‌ పేరుతో నిత్యం వేలల్లో ఖర్చులు పెడుతూ నెలల తరబడి ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుండడంతో కొందరు ఇంటి వద్దనే మంచం పట్టి కాలం వెళ్లదీస్తున్నారు. కాగా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కిడ్నీవ్యాధికి గురయ్యారు. ప్రస్తుతం కుటుంబంలో గొర్లె బంగరాప్పడు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడు. కాగా తన కుమారుడు గొర్లె త్రినాథ్‌, భార్య లక్ష్మి ఇదే మహమ్మారికి బలైపోవడంతో కుటుంబం కకావికలం అయ్యింది.

సమగ్ర పరిశీలన చేపట్టాలి

మా గ్రామంలో గత పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో పదిమందికి పైగా చనిపోయారు. ఇంకా మరో ఐదుగురు కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్నారు. తాగునీటి వలనే కిడ్నీ వ్యాధి వస్తుందా.. లేక మరే ఇతర కారణం ఉందా అనే అంశంపై ఆధికారులు సమగ్ర పరిశీలన చేపట్టాలి.

– ఇజ్జాడ అప్పలనాయుడు, గ్రామ నాయకుడు

ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి

మా ఇజ్జాడపాలెం గ్రామంలో తాగునీటి సమస్య వల నే కిడ్నీ వ్యాధి వస్తోందని అనుకుంటున్నాం. ఇప్ప టికైనా అధికారులు పూర్తిస్థాయిలో స్పందించి ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి. అలాగైనా కిడ్నీ వ్యాది వ్యాప్తి చెందకుండా ఆగే అవకాశం ఉంటుంది.

– ఇజ్జాడ రాము, గోవిందపురం, ఎంపీటీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement