● పట్టపగలే చైన్ స్నాచింగ్
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో పట్టపగలు జనసంచారం అధికంగా ఉన్నచోట ఒక మహిళ మెడలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా పట్టణంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న జగన్నాథపురానికి చెందిన కాల్ల పద్మ విధులు ముగించుకొని తోటి టీచర్స్‌తో కలిసి ఇంటికి వెళ్తోంది. ఈ సమయంలో బండి వీధి వద్ద ఒక షాపింగ్ మాల్ వద్దకు వచ్చేసరికి శిథిల ప్రభుత్వ షాపుల వైపు నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మెడలో ఉన్న చైన్‌ను లాక్కొని వెళ్లిపోయారు. దీంతో పద్మ రోడ్డుపై పడిపోగా చుట్టుపక్కల వాళ్లు తేరుకొని, ద్విచక్ర వాహనాన్ని వెంబడించే ప్రయత్నం చేయగా సత్యవరం జంక్షన్ వైపు అత్యంత వేగంగా పరారయ్యారు. కాగా పద్మను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ తన మెడలో రెండు పావు తులాల పుస్తెలతో పాటు బంగారు గొలుసు ఉందని తెలిపారు. కాగా ఈ సంఘటనపై వెంటనే స్పందించిన నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
బాధితురాలు పద్మ నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఐ గణేష్


