హిరమండలం: వంశధార అధికారుల అనాలోచిత నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ప్రస్తుతం బ్యారేజీలో నీటిని స్థిరీకరించకుండా దిగువకు విడిచిపెడుతున్నారు. దీంతో ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటిని విడిచిపెట్టాలని సోమవారం రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గొట్టా బ్యారేజీపై రైతులు బైఠాయించడంతో అటు పాతపట్నం, ఇటు శ్రీముఖలింగం, మరోవైపు హిరమండలం నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. రైతులు మాట్లాడుతూ ఇటీవల బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడిచిపెడితే ఆందోళన చేశామని, నెలాఖరు వరకు నీటిని ఎడమ ప్రధాన కాలువ ద్వారా అందించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించామన్నారు. అయినా మళ్లీ నీటిని కిందకు విడిచి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ గా పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి సాగు చేశామని, తీరా పంట చేతికి అందివస్తున్న వేళ నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఈ విషయంలో కలెక్టర్, మంత్రులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


